
మృతుడి ఆచూకీ లభ్యం
కొత్తవలస: ఈ నెల 26న మండలంలోని కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలోని చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు కనుగొని ఎస్‌కోట సీహెచ్‌సీకి తరలించిన విషయం తెలిసిందే. కాగా ప్రధాన ప్రతికల్లో వచ్చిన కథనాలు, ఫొటోలను మృతుడి భార్య, కుమారుడు గుర్తించి పోలీసులను సంప్రదించారు. ఈ మేరకు చెరువులో కలువ పూలకోసం దిగి మృతి చెందిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా బాతువ గ్రామానికి చెందిన అలుగోలు తవుడు(48)గా గుర్తించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు, సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి బతుకు తెరువు కోసం కొత్తవలస సమీపంలో గల కుమ్మరిబంజరి ప్రాంతానికి అలుగోలు తవుడు కుటుంబసభ్యులు వచ్చారు. టైలరింగ్, కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తవుడికి మద్యం తాగే అలవాటు ఉంది. సమీపంలో గల ఆటో డ్రైవర్, మరో వ్యక్తితో కలిసి తరచూ మద్యం తాగేవాడు. ఈ క్రమంలో వారు ముగ్గురూ ఈ నెల 25న మద్యం తాగి కొత్తసుంకరపాలెం గ్రామం సమీపంలో గల చెరువులో గల కలువ పువ్వులను ఏరి వినాయక చవితికి అమ్ముకుందామన్న ఉద్దేశంతో ఆటోలో వెళ్లారు. చెరువులోకి దిగిన తవుడికి లోతు తెలియక చాలా సేపు కనిపించక పోవడంతో ఆయనతో పాటు వెళ్లిన ఆటో డ్రైవర్, మరో వ్యక్తి అక్కడినుంచి పారిపోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.