కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు | - | Sakshi
Sakshi News home page

కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

Aug 29 2025 6:30 AM | Updated on Aug 29 2025 6:30 AM

కోట్ల

కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

పార్వతీపురం రూరల్‌: రోజురోజుకూ సైబర్‌ నేరాలు పెరుగుతూ కోట్ల రూపాయల డబ్బుపై అనేక రకాలుగా ఆశ చూపించి సైబర్‌ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. ఒక్క పార్వతీపురానికి సంబంధించి గత జనవరిలోనే అక్షరాలా కోటి రూపాయలపై చిలుకు నగదును సైబర్‌ నేరగాళ్లు నాలుగు కేసులకు సంబంధించి కొల్లగొట్టారంటే ఏ స్థాయిలో సైబర్‌ వలలో ప్రజలు పడుతున్నారో తేటతెల్లమవుతుంది. ముందుగా సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు ఉన్న బ్యాంకు నమూనాలతో లింకులు పంపించి అలాగే మతపరమైన లింకులు పంపించి ఆ లింకులు తెరిస్తే, తెరిచిన వారి వాట్సాప్‌, టెలిగ్రామ్‌ అకౌంట్లను ఆధీనంలోకి తెచ్చుకుని వారి కాంటాక్ట్‌లకు కూడా లింకులు పంపించి ప్రత్యేకంగా గ్రూపులు క్రియేట్‌ చేస్తూ ఈజీ రిటర్‌న్స్‌’ ప్రామాణికంలో డబ్బులు వస్తాయని ఎర చూపుతున్నారు. ఈ మేరకు పార్వతీపురం పట్టణంలో ముగ్గురు, రూరల్‌ పరిధిలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు ఇటీవల కేసులు నమోదు చేశారు.

ఇద్దరు ఉద్యోగుల నుంచి రూ.96లక్షలు

పట్టణంలోని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సైబర్‌ వలలో పడి ఏకంగా రూ.46లక్షలు పోగొట్టుకున్నారు. అలాగే ఓ మెడికల్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రూ.48లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా దోచుకున్నారు. ఇంకా ఇటీవల పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, ఈజీ రిటర్‌న్స్‌ పేరిట ఓ మహిళ నుంచి రూ.4,30,000 లు కాజేశారు. రూరల్‌ పరిధిలో ఏకంగా ఓ పోలీసు ఉద్యోగికి రూ.60వేలు ఆశ చూపించి దోచేశారు. అయితే ముందుగా గ్రూప్‌లో యాడ్‌అయిన అనంతరం కొంతమొత్తాన్ని పెట్టుబడిగా పెడితే అనతికాలంలోనే పెట్టుబడికి కలిపి మరికొంత డబ్బును ఖాతాలో జమచేసి ఎరవేస్తారు. అనంతరం లక్షల మేర డిపాజిట్లు చేస్తున్నప్పుడు ఆయా సాఫ్ట్‌వేర్‌లో బాధితులకు లక్షల రూపాయలు వచ్చినట్లు చూపిస్తూ ప్రస్తుతానికి బాధితుల ఖాతానుంచి తీయడం కుదరదంటూ మరికొంత డబ్బులను జమచేస్తేనే ఖాతాలో లక్షల రూపాయలు క్రెడిట్‌ అవుతాయని ఆశ చూపించి ఎరవేస్తారు. బాధితులు తమ వద్ద మరి డబ్బులు లేవని తెలిపే సమయానికి మొత్తం గ్రూపును డిలీట్‌చేస్తూ వారి అసలు రూపాన్ని చూపిస్తారు. ఈ తరహాలోనే మోసాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్ల గొడుతున్నారు.

పట్టణ పరిధిలో జనవరి నుంచి రూ.కోటి మేరకు లూటీ

సామాజిక మాధ్యమాల్లో లింకులతో ఎర

ఇద్దరు ఉద్యోగుల నుంచి 94లక్షలు కాజేసిన నేరగాళ్లు

అవగాహనతోనే అరికట్టవచ్చు

ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాల ద్వారా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పిస్తున్నాం. అయినప్పటికీ ఉద్యోగులు, చదువుకున్న వ్యక్తులు ఈ విధంగా మోసాలకు గురవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు గుర్తుతెలియని వ్యక్తులు సులువు పద్ధతిలో డబ్బులు ఇస్తామని చెబితే ఎలా నమ్ముతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పటికే జరిగిన కేసులకు సంబంధించి సైబర్‌ నేరగాళ్లు ఇతర రాష్ట్రాలైన బీహార్‌, రాజస్థాన్‌, తదితర రాష్ట్రాలకు చెందిన వారిగా ప్రాథమిక సమాచారం ఉంది. ఎస్పీ ఆదేశాలతో సామాజిక మాధ్యమాల్లో, బహిరంగ ప్రదేశాల్లో, కళాశాలల్లో, వివిధ కూడళ్లలో శాఖాపరంగా అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు అవగాహన కలిగి ఉండి ఆన్‌లైన్‌ కాల్స్‌ను నిర్ధారించకుండా తమకు తెలిసిన వారని చెప్పినా అది నిజమో, అబద్ధమో నిర్ధారణ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆఫర్లు అంటూ, పార్ట్‌టైం ఉద్యోగాంటూ వచ్చిన లింకులను తెరవకూడదు.

– కె. మురళీధర్‌, పార్వతీపురం పట్టణ సీఐ

కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు1
1/1

కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement