
తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నందున తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి పి.అచ్యుతకుమారి సూచించారు. మండలంలోని తీర ప్రాంతాలైన కోనాడ, బొడ్డుగురయ్యపేట, తిప్పలవలస, మత్సవానిపాలెం గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి, ఆయా గ్రామాల్లోని వైద్య శిబిరాలను సందర్శించారు. అనంతరం తుపాను సహాయక చర్యలపై ఆరాతీశారు. ప్రజలకు వైద్యారోగ్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, ఎవరైనా జ్వర లక్షణాలతో బాధపడితే వారికి వెంటనే వైద్యం అందేలా చూడాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ చేపట్టి, జనానికి పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. ప్రసవానికి దగ్గరగా ఉన్న గర్భిణులను దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, సాధారణ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడి నుంచి పూసపాటిరేగ పీహెచ్‌సీకి వెళ్లి, వైద్య సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, కుక్క, పాముకాటుల వ్యాక్సిన్లు పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. ఆమె వెంట వైద్యాధికారి ప్రమీలాదేవి ఉన్నారు.
విజయనగరం అర్బన్: పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కేంద్రియ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా కోరారు. జిల్లాలోని అదే యూనివర్సిటీలో టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో సుస్థిర పర్యాటకం–ఉపాధి అవకాశాలకు మూలం అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాపును గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పండగలు, జాతరలు, తిరునాళ్లు వంటి సామూహిక వేడుకలను పర్యావరణ హితంగా జరుపుకోవాలని సూచించారు. ఈ వర్క్‌షాపులో భాగంగా పట్టణంలోని సహజ పరిసరాలను విద్యార్థులు సందర్శించి, ప్రజలను కలిసి పర్యావరణకు వారు పాటుపడేలా చైతన్యం చేయాలన్నారు. అలాగే సంప్రదాయ కళలు, హస్తకళల రక్షణను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం కో–ఆర్డినేటర్ దీపక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.