
గర్భిణి మృతిపై విచారణ
పాలకొండ: స్థానిక ఏరియా ఆస్పత్రిలో బుధవారం గర్భిణి మృతి చెందడంపై డీసీహెచ్‌ఎస్ నాగభూషణ్ గురువారం విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ చిరంజీవి అందించిన వివరాల మేరకు మండలంలోని తంపటాపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి పధ్మ మూడవ కాన్పు కోసం ఏరియా ఆస్పత్రిలో ఉదయం 9గంటలకు ఆసుపత్రిలో చేరింది. అప్పటికే తీవ్ర రక్తసావ్రం కావడంతో ఆమెను అక్కడ ఉన్న సిబ్బంది పరిశీంచారు. ఇంతలో ఆమె ఆస్పత్రిలో ఉదయం 11 గంటల సమయంలో మరణించింది. అప్పటికే విధుల్లో ఉండాల్సిన వైద్యులు లేక పోవడంతోనే పద్మ మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు. దీనిపై ఫిర్యాదు రావడంతో డీసీహెచ్‌ఎస్ ఏరియా ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. గ్రామంలోని ఆశవర్కర్, ఏఎన్‌ఎం, ఎంల్‌హెచ్‌పీల నుంచి వివరాలు తీసుకున్నారు. రక్తస్త్రావం ఎక్కువగా అవడంతోనే మృతి చెందినట్లు వారంతా చెప్పారు. ఆస్పత్రికి తీసుకురావడం ఆలస్యమైందని సూపరింటెండెంట్ వివరించారు.
హెల్మెట్ వాడకం తప్పనిసరి
● ఎస్పీ వకుల్ జిందల్
విజయనగరం క్రైమ్: రహదారి భద్రత, ప్రమాదాల నివారణలో భాగంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్, హైవేలపై, ప్రధాన జంక్షన్‌ల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టి ‘హెల్మెట్ ధారణ’ పై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం స్పష్టం చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి 24 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, 452 కేసులు నమోదు చేసి, ఈ చలానాగా రూ.4,75,725/లను విధించామన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. రహదారి భద్రత నియమాలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనని వాహనదారులను ఎస్పీ హెచ్చరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ను మూడు సబ్ వివిజన్లలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యా రెడ్డి, చీపురుపల్లి డీఎస్పీఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు.