మహిళలను తిట్టడమేనా..
ఆదివారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2025
● ప్రజాప్రతినిధిగా ఇదేనా సంస్కారం ● ఎమ్మెల్యే విజయ చంద్ర వ్యాఖ్యలు బాధించాయి.. ● కమిషనర్ తీరు ఆక్షేపణీయం ● ఆవేదన వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్‌పర్సన్ గౌరీశ్వరి, వైఎస్సార్ సీపీ మహిళా కౌన్సిలర్లు ● ఎస్పీకి ఫిర్యాదు
పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర, కమిషనర్ వెంకటేశ్వరులపై
ఎస్పీ మాధవ్‌రెడ్డికి ఫిర్యాదుచేస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గౌరీశ్వరి
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్:
మొన్న ఒక మండల మేజిస్ట్రేట్, మహిళా తహసీల్దార్‌పై అసభ్య పదజాలంతో బెదిరింపు, మీడియా సమావేశంలోనూ రాయలేని మాటలతో ఆ అధికారిణిపై దుర్భాషలు... నిన్న పార్వతీపురం పట్టణ ప్రథమ పౌరురాలు పట్ల అనుచిత వ్యాఖ్యలు.. మరి రేపు? పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలితో బాధితులుగా మారుతున్న మహిళల ఆవేదన ఇది. ఇప్పటికే ఇద్దరు అబలలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల కిందట పార్వతీపురం మండల తహసీల్దార్ పోలీసులకు రాసినట్లు ఒక ఫిర్యాదు లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌అయ్యింది. ఇప్పుడు మరో బీసీ మహిళ.. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మహిళలు అంటే తనకు ఎంతో గౌరవమని తానుగా ప్రకటించుకున్న ఎమ్మెల్యే... వారిని అగౌరవ పరచడమే గౌరవించడమా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై ఏకంగా నలుగురు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇంత అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం, టీడీపీ అధిష్టానం కూడా స్పందించకపోవడంపై వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇది మహిళాలోకానికి అవమానకరమని చెబుతున్నారు.
ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన చైర్‌పర్సన్
ఈ నెల 23న జరిగిన పార్వతీపురం పురపాలక సంఘ బడ్జెట్, సాధారణ సమావేశంలో పట్టణ ప్రథమ పౌరురాలైన తనపై పోలీసుల సమక్షంలోనే కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసభ్య పదజాలంతో దూషణకు దిగారని మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని.. తమ సభ్యులపై టీడీపీ వారు దౌర్జన్యానికి దిగినా నవ్వుతూ ఉండిపోయారని జిల్లా ఎస్పీ మాధవ్‌రెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. కూటమి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచనలతోనే ఇదంతా జరిగిందన్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగితే.. ఒక్క వైఎస్సార్‌సీపీ సభ్యులనే పోలీసులు బలవంతంగా నెట్టుకుంటూ బయటకు పంపేశారని తెలిపారు. ఎమ్మెల్యే సైగలు చేయడంతోనే తమ పార్టీ కౌన్సిలర్లు రణభేరి బంగారు నాయుడు, నిమ్మకాయల సుధీర్లను బయటకు నెట్టేశారని వివరించారు. కనీసం మహిళ అని చూడకుండా తనపై ఎమ్మెల్యే విజయచంద్ర అనుచిత వ్యాఖ్యలు చేశారని.. తనను సైకోగా మీడియా ఎదుటే కించపరిచారని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయన్నారు.
న్యూస్‌రీల్
మున్సిపల్ కమిషనర్ తీరుపైనా ఫిర్యాదు
మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తీరుపైనా ఆమె ఫిర్యాదు చేశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఇంటికి సిబ్బందిని సంతకాల కోసం పంపిస్తున్నారని.. ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఒక మహిళ పట్ల ఇలాగేనా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ మహిళా ఉద్యోగులు సైతం ఆయన తీరుతో తీవ్ర మనోవేదనకు, భయబ్రాంతులకు గురవుతున్నట్లు వివరించారు. న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.


