ఎన్‌సీడీ – ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా జగన్
పార్వతీపురం టౌన్: ఎన్‌సీడీ – ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా డాక్టర్ టి.జగన్మోహనరావును నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు ఆయనకు ఉత్తర్వులను డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు అందజేశారు. కమిషనర్, ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం నుంచి పొరుగు సేవల ప్రాతిపదికన డాక్టర్ జగన్మోహనరావును ఎన్‌సీడీ – ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయని డీఎంహెచ్‌వో తెలిపారు. గతంలో డీఐవో, డీఎంవో, ఇంచార్జ్ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా, పలు ఆరోగ్య కార్యక్రమాలకు ప్రోగ్రాం అధికారిగా జగన్మోహనరావు జిల్లాలో పని చేశారు.
గంజాయి పట్టివేత
వేపాడ: మండలంలోని పాటూరు జంక్షన్ సమీపంలో కారులో రవాణా చేస్తున్న రెండు కేజీల గంజాయి పట్టుకున్నట్టు వల్లంపూడి ఎస్‌ఐ ఎస్.సుదర్శన్ తెలిపారు. శనివారం ఎస్.కోట – కొత్తవలస ప్రధాన రహదారిలో పాటూరు వద్ద ఎస్‌ఐతో పాటు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అరకు నుంచి విశాఖ వైపు వెళ్తున్న మారుతీ సుజుకి తెలంగాణకు చెందిన కారులో ఇద్దరు వ్యక్తులు గంజాయితో పట్టుబడినట్టు ఎస్‌ఐ తెలిపారు. పట్టుబడిన గంజాయితీఓ పాటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు చెప్పారు. తనిఖీల్లో తహసీల్దార్ జె.రాములమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పోక్సో కేసులో ఒకరి అరెస్టు
భామిని: మండలంలోని కోసలికి చెందిన కరణం తిరుపతిరావును పోక్సో చట్టం కింద శనివారం అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరు పరిచినట్టు బత్తిలి ఎస్‌ఐ జి.అప్పారావు తెలిపారు. ఈ నెల 22న కోసలికి చెందిన పదేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఉడుమును పట్టుకున్న వ్యక్తి అరెస్టు
విజయనగరం గంటస్తంభం: జొన్నాడ జంక్షన్ వద్ద ఈ నెల 19వ తేదీన గణేష్‌నగర్‌కు చెందిన వనము తాతా అనే వ్యక్తి ఉడుమును పట్టుకుని సంచరిస్తుండగా డీఎఫ్‌వో బి.శ్రీనివాసరావు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఉడుమును చంపడం నేరమని, వన్యప్రాణులను చంపినా, వాటిని కొనుగోలు చేసినా చట్టరీత్యా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఉడుమును పట్టుకున్న వనము తాతాపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
సాలూరు: సాలూరు ఆర్టీసీ డిపోలో రోజు వారి వేతనంపై తాత్కాలికంగా డ్రైవర్‌గా పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు 18 నెలలు గడువు నిండి ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు డిపోలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్
కొత్తవలస : మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడిన అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన జోడు అప్పన్న(32)కు రిమాండ్ విదించినట్టు సీఐ షణ్ముఖరావు శనివారం తెలిపారు. దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. నిందితుడు బాలికపై ఈ నెల 21వ తేదీన అత్యాచార యత్నానికి పాల్పడినట్టు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. శనివారం నిందితుడిని తుమ్మికాపల్లి జంక్షన్ సమీపంలో మాటు కాసి పట్టుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కొత్తవలస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో ఎస్.కోట సబ్ జైలుకు తరలించినట్టు చెప్పారు.
ఎన్‌సీడీ – ఆర్‌బీఎస్‌కే జిల్లా ప్రోగ్రాం అధికారిగా జగన్


