పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు

May 5 2025 8:34 AM | Updated on May 5 2025 11:37 AM

పోలీస

పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు

సోమవారం శ్రీ 5 శ్రీ మే శ్రీ 2025

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోలీసు సిబ్బంది

సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లా పోలీస్‌ శాఖలో జరిగిన బదిలీలపై సొంత సిబ్బంది నుంచే అసంతృప్తి వ్యక్తమవుతోంది. బదిలీలు పారదర్శకంగా నిర్వహించలేదని.. కనీసం ఎవరికి ఏ స్థానం కావాలో అనే ఆప్షన్‌ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 74 మంది పోలీసు సిబ్బందికి ఈ నెల 3వ తేదీన సాధారణ బదిలీల్లో భాగంగా స్థాన చలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నలుగురు ఏఎస్సైలు, 24 మంది హెచ్‌సీలు, 46 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మన్యం జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పని చేస్తూ, నాలుగేళ్లు సర్వీసు దాటి ఉన్న వారికి కచ్చితంగా బదిలీ చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మొత్తం ప్రక్రియపైనే పోలీస్‌ సిబ్బంది నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి కౌన్సెలింగ్‌ నిర్వహించలేదు సరికదా.. కనీసం ఆప్షన్లు ఇవ్వకుండానే నేరుగా ఉత్తర్వులు ఇచ్చేశారని వాపోతున్నారు. ప్రధానంగా పాచిపెంట నుంచి సీతంపేట.. సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం ఇలా ఇష్టారీతిన బదిలీలు చేసేశారని చెబుతున్నారు. మరోవైపు జిల్లా ఆవిర్భావం తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన చాలా మంది పోలీస్‌ ఉద్యోగులు పాలకొండలో పని చేస్తున్నారు. వీరంతా శ్రీకాకుళంలో స్థిరపడటంతో అక్కడ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పుడు వీరికి కూడా పాచిపెంట, సాలూరు వంటి ప్రాంతాలకు స్థాన చలనం కలిగించడంతో ఆందోళన చెందుతున్నారు. బదిలీలకు తాము వ్యతిరేకం కాదని.. కనీసం తమ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారీతిన చేయడం సరికాదని చెబుతున్నారు.

ఎస్పీ ఆలోచన మంచిగానే ఉన్నప్పటికీ...

మరోవైపు చాలా మంది పోలీస్‌ సిబ్బంది ఎక్కువ సంవత్సరాలుగా మైదాన ప్రాంతాల్లోనే తిష్ట వేశారు. ఇదే సందర్భంలో అప్పట్లో ఏజెన్సీకి బదిలీపై వెళ్లిన వారు బదిలీలకు అవకాశం లేక, అక్కడే చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గుర్తించే ఎస్పీ మాధవరెడ్డి ఈసారి బదిలీల్లో ఏళ్ల తరబడి మైదాన ప్రాంతాల్లో తిష్ట వేసిన ఉద్యోగులను కదిలించారని తెలుస్తోంది. ఎస్పీ ఆలోచన మంచిదే అయినప్పటికీ.. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కీలకంగా వ్యవహరించే ఓ ఉద్యోగి.. మధ్యలో తలదూర్చి, మధ్యవర్తిత్వం వహించి, బదిలీల ప్రక్రియను తన అనుకున్న వారికి ‘అనుకూలంగా’ మార్చేశారన్న ఆరోపణలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఎస్పీ వద్ద తనకున్న పరిచయాన్ని దుర్వినియోగం చేస్తూ, జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు.

న్యూస్‌రీల్‌

ఎమ్మెల్యేల వద్దకు పరుగులు

మరోవైపు కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి ఇష్టం లేని ఉద్యోగులు ఎమ్మెల్యేల వద్దకు పరుగులు తీస్తున్నారని తెలిసింది. సిఫారసు లేఖలో.. ఒక ఫోన్‌ కాల్‌తోనో తమ బదిలీ ఉత్తర్వులను నిలుపు చేసుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అదీ కుదరకుంటే కోరుకున్న చోటకు పంపించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాప్రతినిధులతో పెద్దగా పరిచయం లేని ఉద్యోగులు మాత్రం మిన్నుకుండిపోయి, ఇష్టం లేకున్నా కొత్త స్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు 1
1/1

పోలీసు శాఖలో.. ఇష్టారీతిన బదిలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement