జాడలేని చలివేంద్రాలు! | - | Sakshi
Sakshi News home page

జాడలేని చలివేంద్రాలు!

Apr 1 2025 12:54 PM | Updated on Apr 1 2025 1:45 PM

మండుతున్న ఎండలు..
●40 డిగ్రీలకు చేరుకుంటున్న ఉష్ణోగ్రతలు ●ఉదయం నుంచే ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు, ప్రయాణికులు ●చలివేంద్రాలపై ప్రకటనలకే పరిమితమవుతున్న అధికారులు

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో మార్చి నెలలోనే ఎండలు ఠారెత్తించాయి. 40 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. ఇంకా ఏప్రిల్‌ మొదలైంది. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలయ్యేసరికి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రమైనా వేడి వాతావరణం తగ్గడం లేదు. ఇళ్లలో ఉన్నప్పటికీ.. ఏసీలు, కూలర్లు ఉంటేనే గానీ.. భరించలేని పరిస్థితి. వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జిల్లాలోని బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం తదితర మండలాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని 15 మండలాల పరిధిలో గత నెల 30వ తేదీన నాలుగు మండలాలు, 31న 10 మండలాల్లో వేడిగాలుల ప్రభావం కనిపించింది. ఈ నెల ఒకటో తేదీన మంగళవారం కూడా ఎనిమిది మండలాల్లో వేడిగాలులు ఉంటాయని విపత్తుల నిర్వహణ శాఖ చెబుతోంది. వారం రోజుల కిందట రాత్రి వేళ కురిసిన గాలులు, వర్షం మినహాయించి.. మిగిలిన రోజుల్లో చినుకు జాడ లేకపోవడంతో మూగజీవాలు సైతం నీటి కోసం అల్లాడిపోతున్నాయి. పశువులకు తాగునీరు అందించేందుకు జిల్లాలో 411 పశువుల తొట్టెలు మంజూరయ్యాయి. వీటి పనులు ప్రారంభించాల్సి ఉంది.

కానరాని చలివేంద్రాలు

గతంలో వేసవిలో ప్రభుత్వపరంగా మంచినీటి చలివేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకునేవారు. మండల కేంద్రంతో పాటు.. రద్దీ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేసేవారు. ఇందు కో సం ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు కేటాయించేవి. దీంతో పాటు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలు వెలిసేవి. ఏప్రి ల్‌ వస్తున్నా ప్రభుత్వపరంగా చలివేంద్రాల జాడ ఎక్కడా లేదు. కేవలం అధికారుల ప్రకటనలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ప్రయాణికులు, వాహనచోదకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. దాహం వేస్తే మంచినీటి బాటిళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. రూ.20 చొప్పున నీటి బాటిల్‌ కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని బాటసారులు, వాహనచోదకులు చెబుతున్నారు. దీనిని వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో శుద్ధిచేయని నీటినే సీసాల్లో నింపి విక్రయిస్తున్నారు. ఇటువంటి నీటిని తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఉపాధి హామీ పను ల వద్ద మజ్జిగ, తాగునీరు, మెడి కల్‌ కిట్లు, టెంట్లు వంటివి కానరావడం లేదు. ఎండల్లోనే వేతనదారులు పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రత్యేకంగా పనుల వద్ద ఈ సౌకర్యాలు కల్పించడానికి పెద్దఎత్తున నిధులు విడుదలవుతున్నా.. క్షేత్రస్థాయిలో వాటి జాడ కనిపించడం లేదు.

ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా

ఉన్నందువల్ల వడదెబ్బ బారిన పడకుండా వివిధ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

●ఎక్కువగా నీటిని తాగాలి. కొబ్బరినీరు, ఓఆర్‌ఎస్‌ ద్రావణం, ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు వంటివాటితోపాటు.. నీటి శాతం అధికంగా లభించే కర్బూజా వంటివాటిని తీసుకోవాలి.

●వీలైనంత వరకు ఎండలో తిరగడం తగ్గించాలి

(ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు). తప్పనిసరి పరిస్థితుల్లో టీపీ, చలువ కంటి అద్దాలు, గొడుగు ధరించాలి. లేత కాటన్‌ రంగు దుస్తులను ధరించాలి.

●శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. సురక్షిత నీటినే తాగాలి.

●తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుడిని సంప్రదించాలి.

●ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి.

ఎండలతో

జాగ్రత్తలు తప్పనిసరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement