పార్వతీపురం టౌన్: సీతంపేట ఐటీడీఏ పరిధి దోనుబాయి ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు ఆదేశించారు. విద్యార్థి సవర చలపతిరావు పాఠశాలలో 9వ తరగతి చదువుతూ మంచం పైనుంచి పడి శుక్రవారం మృతి చెందిన విషయమై సంబంధిత అధికారులతో డీవీజీ శనివారం మాట్లాడారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సబ్‌జైల్ ఆకస్మిక తనిఖీ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ (న్యూ ఢిల్లీ) ఉత్తర్వుల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి జిల్లా కేంద్రంలోని సబ్ జైల్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించి ఖైదీలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం సబ్ జైల్‌లో కొనసాగుతున్న జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్‌లను పరిశీలించారు. జైల్‌లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమని చెప్పారు. అలాగే వంటగదిని పరిశీలించారు. పరిశీలనలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ కె. సూర్య ప్రకాష్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ డి. సీతారాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పీబీఎస్ సాయి పవిత్ర, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సూపరింటెండెంట్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిబ్బంది పాల్గొన్నారు.
మెడికల్ ఏజెన్సీ లైసెన్స్ రద్దు
● మరో పది మెడికల్ షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేత
విజయనగరం ఫోర్ట్: నిబంధనలు అతిక్రమించిన ఓ మెడికల్ ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు మరో పది మెడికల్ దుకాణాల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఔషధ నియంత్రశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. రజిత తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఆపరేషన్ గరుడలో భాగంగా కొద్ది రోజుల కిందట జిల్లాలో పలు మెడికల్ షాపులను (మందుల దుకాణాలు) విజిలెన్స్, ఔషధ నియంత్రణశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలో పది మెడికల్ షాపుల్లో కాలం చెల్లిన మందులు ఉన్నాయని, అదేవిధంగా జిల్లా కేంద్రంలోని రత్నం ఫార్మాస్యూటికల్స్ ఏజెన్సీలో కాలం చెల్లిన మందులు అధిక మొత్తంలో ఉండడంతో పాటు డాక్టర్ ప్రిస్కప్షన్ లేకుండా మత్తు కలిగించే దగ్గు మందులు విక్రయస్తున్నట్లు గుర్తించామన్నారు.దీంతో ఏజెన్సీ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పది మందుల షాపుల లైసెన్స్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు.
అప్రమత్తంగా ఉండండి
నెల్లిమర్ల: ఈవీఎం గొడౌన్ భద్రతపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. మండల కేంద్రంలోని గొడౌన్‌ను శనివారం ఆయన సందర్శించారు. షట్టర్లకు వేసిన సీళ్లను తెరిపించి, లోపల గదుల్లో ఉంచిన ఈవీఎంలను పరిశీలించారు. అనంతరం దగ్గరుండి సీళ్లు వేయించారు. పరిశీలనలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, తహసీల్దార్ సుదర్శనరావు, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, ఇతర రెవెన్యూ సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు సముద్రపు రామారావు పాల్గొన్నారు.
విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి
విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి


