సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర

Mar 18 2025 8:52 AM | Updated on Mar 18 2025 8:47 AM

సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు

విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా 46వ డివిజన్‌లో సోమవారం పర్యటించి, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు రెండు సెంట్ల భూమి కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో చాలా మంది ఇళ్లు లేనివారు ఉన్నారని, అటువంటి వారందరికీ న్యాయం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో తహసీల్దార్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.రమణమ్మ, బి.రమణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

గుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని దురిబిల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 700 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి భారీగా ప్లాస్టిక్‌ టబ్బులను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయించినా, తరలించినా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.

గంజాయితో ఐదుగురి అరెస్ట్‌

గుర్ల: గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గుర్ల మండలంలోని సొలిపిసోమరాజు పేట చంపావతి నదీపరీవాహక ప్రాంతంలో 1200 గ్రాముల గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు సోమవారం పట్టుకుని ఆరెస్ట్‌ చేశారన్నారు. అరెస్ట్‌ చేసిన వారిలో మండలంలోని సొలిపిసోమరాజు పేటకు చెందిన ఇద్దరు, దమరసింగికి చెందిన ఒకరు, నెల్లిమర్లకు చెందిన ఒకరు. జామి మండలం ఆలమండకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ద్విచక్ర వాహనం, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి: రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ సీతానగరం స్టేషన్‌ సమీపంలో జారిపడి ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. జార్ఖండ్‌లోని సాలిబురు ప్రాంతానికి చెందిన ప్రధాన్‌ హెంబర్న్‌ (23) సోమవారం చక్రధర్‌ పూర్‌ వెళ్లేందుకు రైలెక్కి సీతానగరం మండలం జగ్గునాయుడి పేట వద్ద జారి పడి మృతి చెందినట్టు రైల్వే హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

చికిత్స పొందుతూ వ్యక్తి..

గంట్యాడ: గంట్యాడ మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన చుక్క రాంబాబు (39) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 9వతేదీన పొలంలో పనిచేస్తుండగా రాంబాబును పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సర్వజన ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్‌ చేయగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర 1
1/3

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర 2
2/3

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర 3
3/3

సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement