● పోలీసుల తీరుపై మండిపడిన పెదగుడబ గ్రామస్తులు
గరుగుబిల్లి: ఆత్యం మైనింగ్ కంపెనీ వాహన రాకపోకలతో దుమ్ముధూళి రేగుతోందని, వ్యాధుల బారిన పడుతున్నామని, దీని నుంచి బయటపడే మార్గం చూపి ప్రాణాలు కాపాడాలని వేడుకుంటే అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ పెదగుడబ గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. అక్రమ అరెస్టులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రోడ్డులో లారీల రాకపోకలను నిలువరించిన గ్రామస్తులకు రక్షణగా నిలవాల్సింది పోయి బుధవారం 15 మందిని, గురువారం మరో నలుగురు యువకులను అరెస్టుచేయడం దుర్మార్గమన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పెదగుడబలోని ప్రజలను నిలువరించేందుకు చినమేరంగి సీఐ టి.వి.తిరుపతిరావు, ఎస్‌ఐ పి.రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 40 మంది పోలీసులు గ్రామంలో మొహరించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ యువకులను బలవంతంగా ఎత్తుకెళ్లి ఉధ్రిక్త వాతావరణాన్ని సృష్టించారన్నారు. ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీసులే గుత్తేదారులకు వత్తాసు పలుకుతూ అక్రమ అరెస్టులకు పాల్పడడం దారుణమన్నారు.
ఈ క్రమంలో గ్రామస్తులు నేరుగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్‌కు తమ గోడు వినిపించారు. తక్షణమే పోలీసులు అదుపులోకి తీసుకున్న గ్రామస్తులను విడుదల చేయాలని, క్వారీ పనులు నిలుపుదల చేయాలని విజ్ఞప్తిచేశారు.
ఆదుకోమంటే.. అరెస్టు చేస్తారా..?


