ఇన్‌చార్జి మంత్రి గారి మాట:
ఈ చిత్రం చూశారా... సాలూరు మండలం సన్యాసిరాజుపేట సమీపంలో రహదారి మధ్యలో ఏర్పడిన పెద్ద గొయ్యి ఇది.. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాత్రి వేళ ప్రయాణం ప్రమాదకరంగా మారింది. దీంతో స్థానికులు హెచ్చరికగా గొయ్యి మధ్యలో ఇలా కరల్రు ఏర్పాటు చేశారు. ఏడు నెలల పాలనా కాలంలో ఈ గొయ్యి పూడ్చడానికి కూటమి పాలకులకు తీరిక కుదరలేదు మరీ..!
‘రూ.850 కోట్ల వ్యయంతో గుంతలు లేని రహదారుల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.’ ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇవీ...
వాస్తవమిదీ.. :
ఆంధ్ర– ఒడిశా అంతరాష్ట్ర రహదారి ఇది.. జిల్లా కేంద్రానికి వస్తున్న ప్రధాన మార్గం. పెద్ద పెద్ద గోతులతో పార్వతీపురం పట్టణంలోకి వచ్చే వారికి సాదర స్వాగతం పలుకుతోంది. పట్టణానికి నలువైపులా ఇదే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని పరిస్థితే ఇలా ఉంటే మారుమూల గ్రామాల్లో కూటమి ప్రభుత్వ హామీ ఏ మేరకు నెరవేరిందో పాలకులకే తెలియాలి. పార్వతీపురం నియోజకవర్గంలోని సీతానగరం మండలం ఏగోటివలస–దయానిధిపురం వయా గాదెలవలస గ్రామాల రోడ్లు రాళ్లు తేలాయి. చినభోగిలి నుంచి బగ్గందొరంవలస మార్గం బీటీ రోడ్డు పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతంతో అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలిజిపేట మండలం భైరిపురం నుంచి అంపావిల్లి వెళ్లే రహదారి గుమ్ములు, గోతులతో ప్రమాదకరంగా ఉంది. కనీసం ఇక్కడ మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు.
సంక్రాంతి పండగకు స్వగ్రామాలకు వచ్చే వారికి గుంతలు లేని రహదారులు స్వాగతం పలుకుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కొద్ది రోజులుగా అవకాశం దొరికినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. ఆ సంక్రాంతి పండగ రానే వచ్చింది. ఎక్కడెక్కడ నుంచో సొంతూర్లకు వస్తున్న జిల్లా వాసులకు మాత్రం గుంతలు పడిన రహదారులే ఎదురొచ్చాయి. రహదారుల మరమ్మతులకు రూ.కోట్లాది నిధులు వెచ్చించామని చెబుతున్న కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు నాసిరకం పనులతో మమ అనిపించగా.. మరికొన్ని చోట్ల, గత ప్రభుత్వం వేసిన అద్దంలాంటి రోడ్లను సైతం తవ్వించి.. ౖపైపె మెరుగులు పూసి, మాయ చేశారు. తాము ఇస్తున్న హామీలను అమలు చేయలేక.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే లక్ష్యంగా మాటల దాడికి దిగుతున్నారు.
నాడు మారుమూల
గ్రామాలకూ రహదారులు..
వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగు నియోజక వర్గాల పరిధిలో మునుపెన్నడూ లేని అభివృద్ధి కనిపించింది. కోట్లాది రూపాయలను వెచ్చించి రహదారులను నిర్మించారు. కొండకోనల్లోని గిరిజన ప్రాంతాలకు సైతం అద్దం లాంటి తారు రోడ్లు వచ్చాయి. కాలక్రమంలో భారీ వాహనాల రాకపోకలు, వర్షాల వల్ల ఎక్కడ రహదారులు అయినా కాస్త దెబ్బతినడం సహజం. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరుగుతుంది. దీన్నే భూతద్దంలో చూపుతూ.. అసలు రహదారులే వేయలేనట్లు కూటమి ప్రభుత్వం విషం చిమ్మడం మొదలు పెట్టింది. పోనీ, అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో సాధించింది ఏమైనా ఉందా అంటే అదీ లేదు. గత ప్రభుత్వం హయాంలో మంజూరైన, పూర్తి అయిన రోడ్లను తమ గొప్పగా చెప్పుకోవడం. అన్నిటికీ మించి రహదారుల మరమ్మతులకు అంటూ కోట్లాది నిధులు ఖర్చు చేసి, నాసిరకం పనులు చేపట్టి, పెద్ద ఎత్తున స్వాహా పర్వానికి తెర తీశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
● మన్యం జిల్లాకు సంబంధించి ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం కింద తొలివిడతలో 46 పనులు మంజూరయ్యాయి. 21.350 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు రూ.12.50 కోట్లు వెచ్చించారు. రెండో విడత 49 పనులకు గానూ రూ.18 కోట్లు కేటాయించగా.. రూ.213.74 మేర రహదారులకు మరమ్మతులకు సిద్ధమయ్యారు.
● పల్లె పండగ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున రహదారుల పనులు చేపడుతున్నట్లు చెబుతున్నారు. రూ.289 కోట్ల అంచనా వ్యయంతో 458 పనులు మంజూరు చేశారు. రూ.32 కోట్ల వ్యయంతో 195 సీసీ రహదారులు, రూ.24 కోట్లతో 204 బీటీ రహదారులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు పలు పనులకు గానూ రూ.126 కోట్లు వెచ్చించారు.
పండగకు వచ్చే వారికి గుంతలు లేని రోడ్లు స్వాగతం పలుకుతాయన్న కూటమి నాయకులు
రెండు నెలలుగా అరకొర గోతులు పూడ్చే పనులే..
అవి కూడా నాసిరకం
కొద్ది రోజులకే మళ్లీ యథాస్థితికి..
రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు
రోడ్ల కష్టాలు యథాతథం
పాలకొండ నియోజకవర్గ పరిధిలోనిది ఈ దృశ్యం. శ్రీకాకుళం రహదారిలో గాయత్రి ఆలయం మీదుగా.. వీరఘట్టం మార్గంలో నవగాం వరకు ఆర్ అండ్ బీ ద్వారా రహదారి మరమ్మతు పనులు చేపట్టారు. రోజులు గడవక ముందే ఈ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. రహదారిపై వేసిన తారు మాయమై రాళ్లు తేలాయి. పాలకొండ, వీరఘట్టం, విశాఖ రహదారులు కలిపే స్థానిక వైఎస్సార్ కూడలి వద్ద రహదారి అధ్వానంగా మారింది. రూ.25 లక్షలు బుగ్గిపాలు అయ్యాయి. ఒక్క పాలకొండ నియోజకవర్గంలోనే పంచాయతీరాజ్ ద్వారా 22 రహదారి పనులకు నిర్ణయించారు. దాదాపు నాలుగు మండలాల పరిధిలో 34.52కిలోమీటర్లు బీటీ, సీసీ రహదారుల పనులకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి రూ.3315.70 లక్షలు అంచనా వ్యయం నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఈ పనులు మందకొడిగా కొనసాగుతుండగా.. వేసిన చోట కూడా నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
ఇన్‌చార్జి మంత్రి గారి మాట:
ఇన్‌చార్జి మంత్రి గారి మాట:


