ఉత్తమ బోధనకు చర్యలు | Sakshi
Sakshi News home page

ఉత్తమ బోధనకు చర్యలు

Published Mon, Nov 20 2023 12:36 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు  - Sakshi

సోమవారం శ్రీ 20 శ్రీ నవంబర్‌ శ్రీ 2023
అంగన్‌వాడీల్లో

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు రాష్ట్రంలోని జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చింది. వీరంతా వారి పరిధిలో పని చేస్తున్న కార్యకర్తలకు శిక్షణ అందించడం ద్వారా చిన్నారులకు నాణ్యమైన విద్య నేర్పించనున్నారు.

పాలకొండ రూరల్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పునాది దశలో పిల్లలకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించే సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు పిల్లలకు ఇచ్చే విద్యాబోధనలో నాణ్యత, మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్యా బోధనపై ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తమ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ అందించేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసామని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆరు రోజుల పాటు శిక్షణ

జిల్లాలో పని చేస్తున్న 10 ప్రాజెక్టుల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు ఒక్కో బ్యాచ్‌లో 50 మంది చొప్పున ఆరు రోజుల పాటు విజయనగరం జిల్లాలోని గజపతినగరంలో గల బాలాజీ పాలిటెక్నికల్‌ కళాశాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన అధికారులు క్షేత్ర స్థాయిలో తమ అంగన్‌వాడీ కార్యకర్తలకు తర్ఫీదు అందించి, పిల్లలకు సరళమైన విధానంలో బోధన చేపట్టేలా కసరత్తు చేపట్టారు. 120 రోజుల కోర్సును కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేసారు. ఈ శిక్షణలో ముఖ్యంగా శిశు సంరక్షణ, విద్య, 3 – 6 సంవత్సరాల వయసు గల పిల్లల లక్షణాలకు అనుగుణంగా వారి మెదడును ప్రభావితం చేసే అంశాలపై తర్ఫీదు అందించారు. విద్యా సంబంధిత అంశంపై దృశ్య రూపం, శారీరక, భాషా అభివృద్ధి కార్యచరణ వంటి పలు అంశాలపై శిక్షణ అందించారు.

కాన్వెంట్లకు దీటుగా విద్యాబోధన

జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో గల 15 మండలాల్లో 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 2,064 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో ప్రధాన కేంద్రాలు 1,425, మిని అంగన్‌వాడీ కేంద్రాలు 639 ఉన్నాయి. 6 నెలల నుంచి 3 సంవత్సారాల మధ్య గల 32,363 మంది, 3 సంవత్సరాల నుంచి ఆరేళ్ల మధ్య గల 23,728 మంది పిల్లలు సేవలు పొందుతున్నారు. వీరిలో ప్రీ స్కూల్‌ పిల్లలు దాదాపు 4800 పైచిలుకు ఉన్నారు. ప్రైవేటు కాన్వెంట్లకు దీటుగా అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు ఉత్తమ బోధన ఉండేలా ప్రీ స్కూలు యాక్టివిటీ (పూర్వ ప్రాథమిక విద్య) ప్రధాన అంశంగా యంత్రాంగం కార్యచరణ చేపట్టింది. ఎక్కువ మంది పిల్లలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చేలా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ శిక్షణలో అవగాహన కల్పించారు. దీనికి అవసరమైన ప్రీ స్కూలు కిట్లను ప్రభుత్వం కేంద్రాలకు అందించనుంది.

శిక్షణతో ఉత్తమ ఫలితాలు

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో సీడీపీఓలు, ఏసీడీపీఓలు, సూపర్‌వైజర్లకు ప్రత్యేక శిక్షణ అందించారు. శిక్షణ పూర్తి చేసిన వారు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలకు అవగాహన కల్పిస్తారు. తద్వారా ఉత్తమ బోధన అందించేలా చర్యలు చేపట్టాం. జిల్లాలో పది మంది సీడీపీఓలు, ముగ్గురు ఏసీడీపీఓలు, 60 మంది సూపర్‌వైజర్లకు శిక్షణ అందించాం.

– ఎం.ఎన్‌.రాణి, ఐసీడీఎస్‌ పీడీ,

పార్వతీపురం మన్యం

న్యూస్‌రీల్‌

నాణ్యమైన విద్యే లక్ష్యంగా.. ముందుకు

ప్రీ స్కూలు యాక్టివిటీపై సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు శిక్షణ

1/1

Advertisement
 
Advertisement