
రైతు కూలీ సంఘ భవనాన్ని ప్రారంభిస్తున్న ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ
మక్కువ: పోరాటాలతోనే గిరిజన హక్కుల సాధన సాధ్యమని రైతుకూలీసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. దుగ్గేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆదివాసీ భవన్‌ను ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరి కష్టంతో నిర్మించిన భవనాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన అటవీ సంరక్షణ చట్టాలు– 2023కు వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆదివాసీ భవన్ నుంచి ర్యాలీగా మార్కెట్ యార్డ్ వరకు వెళ్లి జన్ని తిరుపతి వర్ధంతి సభను రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊయక ముత్యాలు అధ్యక్షతన నిర్వహించారు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి దందులూరి వర్మ మాట్లాడుతూ జెన్ని తిరుపతి అమరుడై నేటికి 24 సంవత్సరాలు కావస్తున్నా ఆయన నేటికీ మనతోనే ఉన్నట్టు అనిపిస్తోందన్నారు. ఆయన ఉద్యమం స్ఫూర్తిదాయకమైనదన్నారు. గిరిజనులందరూ జీవన స్థితిగతులను మెరుగుపరచుకోవాలన్నారు. రైతు కూలీ సంఘం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ మాట్లాడుతూ ఇప్పటివరకు మనం చేసిన పోరాటాలతోనే అంత అయిపోలేదని, మనం సాధించుకున్నది కొంతేనని, సాధించుకోవాల్సింది చాలా ఉందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసి గిరిజనులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ(న్యూ) నాయకుడు బెహరా శంకరరావు, కొండ మొదలు పంచాయతీ సర్పంచ్ వి.విజయ, పి.శ్రీను నాయుడు, ఎం.భాస్కర్‌రావు, పి.అసిరి, ఎమ్.చెంచు తదితరులు పాల్గొన్నారు. నృత్యప్రదర్శనలతో కళాకారులు అలరించారు.
రైతు కూలీ సంఘం భవనాన్ని ప్రారంభించిన రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ