పేట ప్రగతికి అన్నివిధాలా కృషి | - | Sakshi
Sakshi News home page

పేట ప్రగతికి అన్నివిధాలా కృషి

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

వైఎస్సార్‌ సీపీ

మున్సిపల్‌ చైర్మన్‌

అభ్యర్థి షేక్‌ ఖాజావలి

నరసరావుపేట టౌన్‌: నరసరావుపేట అభివృద్ధే లక్ష్యం.. ప్రజలకు పారదర్శక పాలనే ధ్యేయం.. అవినీతికి తావులేని పరిపాలనే సంకల్పం.. ఇదీ వైఎస్సార్‌ సీపీ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి షేక్‌ ఖాజావలి మాస్టారు చెబుతున్న మాట. 111 ఏళ్ల చరిత్ర కలిగిన నరసరావుపేట పురపాలక సంఘానికి దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో చైర్మన్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఖాజావలి మాస్టారు ప్రజల్లో తనకున్న గుర్తింపుతో ముందుకు సాగుతున్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తుండటం ఆయనకు సానుకూల అంశంగా మారుతోంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే నరసరావుపేట పట్టణ రూపురేఖలు మారుస్తానని ఖాజావలి మాస్టారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘ మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డుల్లోనూ వైఎస్సార్‌ సీపీకి మంచి పట్టుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేశాం. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. ప్రజల మద్దతుతో ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది. బాధ్యతతో పట్టణ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. పదవి అనేది హోదా కోసం కాదు.. ప్రజలకు సేవ చేసే అవకాశం. నాపై ప్రజలకు ఉన్న మంచి అభిప్రాయాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. ఉపాధ్యాయ వృత్తి నాకు క్రమశిక్షణ, బాధ్యత, నిజాయతీ నేర్పింది. చైర్మన్‌గా అవకాశం వస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటాను. నరసరావుపేటను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్నది ఆకాంక్ష. కేవలం హామీలు ఇవ్వడం కాకుండా ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.

ప్రాధాన్యం ఇచ్చే అంశాలు ఇవీ..

అవినీతి రహిత పాలన, మౌలిక వసతుల కల్పన, ముంపు నివారణ, యువతకు విద్య, ఉపాధి, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ నరసరావుపేట, వ్యాపారులకు తోడ్పాటు, వృద్ధులు, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తా. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం. చిత్రాలయ థియేటర్‌ వద్ద నుంచి గుంటూరు రోడ్డును కలుపుతూ ఆర్‌యూబీ నిర్మాణానికి కృషి చేస్తా. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటాం. ప్రతి వార్డులో పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేస్తాం. చెత్త సేకరణ, మురుగునీటి కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెడతాం. మున్సిపల్‌ పార్కులను అభివృద్ధి చేస్తాం. ఖాళీ ప్రదేశాలు, రహదారుల పక్కన మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తాం. ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన నరసరావుపేట నిర్మాణానికి కృషి చేస్తాం. నరసరావుపేట ప్రజలతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. చైర్మన్‌గా అవకాశం కల్పిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. అభివృద్ధి, పారదర్శకత, పరిశుభ్రత, ప్రజా సంక్షేమమే నా పాలనలో ప్రాధాన్య అంశాలు. నరసరావుపేటను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల ఆశీర్వాదం కోరుతున్నాను.

కూటమిపై ప్రజావ్యతిరేకత

ఎన్నికల ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి హామీలను నమ్మి మోసపోయామని చెబుతున్నారు. పెరిగిన ధరలకు కుటుంబ బడ్జెట్‌ను తలకిందులైందని మహిళలు వాపోతున్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిస్థితిపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యాలు, బెదిరింపులు, గంజాయి అరికట్టాలని కోరుతున్నారు. కూటమికి తమ ఓటుతో ప్రజలు తగిన సమాధానం చెబుతారనే నమ్మకం ఉంది.’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement