నరసరావుపేట రూరల్: ఉప్పలపాడు సర్పంచ్‌గా వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి యేసిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవికి నంద్యాల సత్యనారాయణరెడ్డి, యేసిరెడ్డి సుబ్బారెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ఉపసంహరణకు శనివారం మద్యాహ్నం 3గంటలకు గడువు ముగిసింది. నంద్యాల సత్యనారాయణ రెడ్డి శనివారం నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ఈపూరు: మండలంలోని కొచ్చెర్ల గ్రామంలో శనివారం ‘పుడింగి’ సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సినిమా యూనిట్ గ్రామానికి చేరుకుని శ్రీ అంకాల పరమేశ్వరి ఆలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘సిరిపురం సత్కార సభ’ సెట్టింగ్‌లో హీరో సంపూర్ణేష్ బాబుపై పలు సన్నివేశాలను చిత్రీకరించింది. షూటింగ్ లోని పలు సన్నివేశాలలో స్థానిక గ్రామస్తులు సైతం ఉత్సాహంగా పాల్గొని నటించారు. గ్రామంలో రెండు రోజులపాటు సినిమా షూటింగ్ కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సినిమా చిత్రీకరణను చూసేందుకు కొచ్చెర్లతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, మహిళలు తరలివచ్చారు. హీరో సంపూర్ణేష్ బాబును చూసేందుకు, షూటింగ్ దృశ్యాలను వీక్షించేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలోని స్కాలర్స్ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా బాలుర(మెన్స్) సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ ఆదివారం నిర్వహించటం జరుగుతుందని ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సెక్రటరీ పి. సామంత్‌రెడ్డి తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనదలచిన ఉమ్మడి గుంటూరు జిల్లా సీనియర్ బాలురు ఆదివారం ఉదయం 9 గంటలకు స్కాలర్స్ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లోకి ఒరిజనల్ ఆధార్‌కార్డుతో హాజరు కావాలని తెలిపారు. సీనియర్ బాలుర సెలక్షన్స్‌లో పాల్గొనేవారికి వయస్సుతో సంబంధం లేదని తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో ఎంపికై నవారు ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ బాలుర జట్టు తరఫున డిసెంబర్‌లో చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి సాఫ్ట్‌బాల్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్ వంశీకృష్ణరెడ్డి, ట్రెజరర్ ఆవుల జనార్దన్ మాదవ్ తదితరులు పాల్గొన్నారు.
శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర వివాదం నెలకొంది. 7వ వార్డు ఇండిపెండెట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఓర్సు అజయ్‌కుమార్, 8వ వార్డు అభ్యర్థి మరియకుమారిలు తమ ప్రమేయం లేకుండానే నామినేషన్ ఉప సంహరించుకున్నట్లు (విత్‌డ్రా) అధికారులు ప్రకటించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయని అధికారులు నిర్థారణ చేశారని, తుది జాబితాలో పేర్లు ప్రకటించకపోవటంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఉప సంహారణ పత్రాలపై సంతకాలు చేయలేదని, కేవలం ఎన్నికల అధికారులు ఏకపక్ష తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తమ ప్రమేయం లేకుండానే ఎన్నికల అధికారులు నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా అధికారులు వ్యవరించటాన్ని ఖండించారు.
నరసరావుపేట: నరసరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది విధుల కేటాయింపుపై శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రెండవ ర్యాండమైజషన్ ప్రక్రియ నిర్వహించారు. అలాగే గ్రామ పంచాయతీ మొదటి ఫేజ్ ఎన్నికల సిబ్బంది విధుల కేటాయింపుపైన రెండవ ర్యాండమైజషన్ ప్రక్రియ నిర్వహించారు. డీపీఓ నాగేశ్వరనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


