భార్య నామినేషన్‌ వేయకుండా భర్తను నిర్బంధిస్తారా ? | - | Sakshi
Sakshi News home page

భార్య నామినేషన్‌ వేయకుండా భర్తను నిర్బంధిస్తారా ?

Nov 22 2026 2:29 AM | Updated on Nov 22 2026 2:29 AM

పోలీసుల తీరుపై మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్‌ సీపీ నాయకుల అరెస్టు పరామర్శించేందుకు వెళుతున్న మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న ఏఎస్పీ.. గృహ నిర్బంధం

చిలకలూరిపేట: భార్య నామినేషన్‌ వేయాల్సి ఉండగా, భర్తను రాత్రికి రాత్రి పోలీస్‌స్టేషన్‌కు తరలించి నిర్బంధిస్తారా..? ఇదెక్కడి న్యాయం అంటూ మాజీ మంత్రి విడదల రజిని పోలీసులను ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా శుక్రవారం అర్ధరాత్రి నాదెండ్ల మండలం బుక్కాపురం మాజీ సర్పంచ్‌ అల్లడి రవికుమార్‌, అప్పాపురం మాజీ సర్పంచ్‌ కోయలమూడి సాంబశివరావు, ఇతర వైఎస్సార్‌ సీపీ నాయకులను నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌లో నిర్బందించారు. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్‌ అభ్యర్దులుగా పోటీ చేసేవారికి రక్షణ కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తీసుకొని నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి విడదల రజిని బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో తిమ్మాపురం నుంచి నాదెండ్ల వెళ్లే మార్గంలో నరసరావుపేట అడిషనల్‌ ఎస్పీ హనుమంతరావు, రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు పోలీసులు సిబ్బందితో కలసి వెళ్లి మాజీ మంత్రిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి విడదల రజిని వాహనాన్ని అడ్డుకున్న ఏఎస్పీ హనుమంతరావు ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇంటి వద్ద పోలీసులను తోసుకొని వచ్చారంటూ ఆరోపణలు చేశారు. దీనికి మాజీ మంత్రి తనను ఎవరూ ఆపలేదని, కావాలంటే మీ సిబ్బందికి ఫోన్‌ చేసి విచారించుకోవాలని సమాధానం చెప్పారు. పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏఎస్పీకి అందజేశారు. తమ పార్టీ వాళ్లను ఎందుకు అక్రమంగా అరెస్టు చేశారో తెలుసుకొనేందుకు మాత్రమే నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు బయలు దేరానని వెల్లడించారు.

అరెస్టు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ ఏదీ?

బుక్కాపురం మాజీ సర్పంచ్‌ అల్లడి రవికుమార్‌ భార్య నామినేషన్‌ వేయాల్సి ఉండగా రవికుమార్‌ను అరెస్టు చేసి స్టేషన్‌లో కూర్చొబెడితే ఎలా అంటూ నిలదీశారు. అక్రమంగా నిర్బందించిన వారిని వదిలిపెట్టాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఏఎస్పీ హనుమంతరావు ఎవరిని వదిలిపెట్టం... ట్రబుల్‌ మాంగర్స్‌ అనుకున్నవారందరినీ అదుపులోకి తీసుకుంటాం అంటూ బదులిచ్చారు. అరెస్టు చేస్తే ఎఫ్‌ఐఆర్‌ చూపెట్టాలంటూ మాజీ మంత్రి పోలీసు అధికారులను నిలదీశారు. అయితే పోలీస్‌స్టేషన్‌కు రావడానికి వీలు లేదంటూ మాజీ మంత్రిని ఏఎస్పీ అడ్డుకున్నారు. ఒక దశలో మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారంటూనే, బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీనికి మాజీ మంత్రి రజిని తాను ఎవరితో గొడవపడేందుకు రాలేదని, అక్రమంగా నిర్బంధించినవారి గురించి విచారించేందుకు మాత్రమే బయలు దేరామని వెల్లడించారు. అయితే స్టేషన్‌కు రావడానికి వీలులేదని, పోటీ చేసే సర్పంచ్‌ అభ్యర్ధుల వివరాలు తమకు అందజేస్తే వారికి భద్రత కల్పించి నామినేషన్లు వేయిస్తామని ఏఎస్పీ హామీ ఇచ్చారు. అభ్యర్ధులను నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు పంపిస్తే భద్రత నడుమ నామినేషన్లు వేయిస్తానని చెప్పి మాజీ మంత్రిని చిలకలూరిపేట పట్టణంలోని ఇంటికి పంపి గృహ నిర్బంధం విధించారు. మాజీ మంత్రి నివాసం వద్ద పోలీసు బలగాలను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement