నామినేషన్లు వేయనివ్వకుండా రౌడీలు, గూండాలతో దాడులు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికల్లో దాడులు,కిడ్నాప్‌లు అక్రమ కేసులతో అనంతవరంకు చెందిన తొమ్మిదిమంది సబ్‌జైల్ పాలు కోర్టులు చివాట్లు పెట్టినా నామినేషన్‌లు వేయనివ్వలేదు 3వ విడత నామినేషన్లు కూడా ఇదే పద్ధతిలో చేసేందుకు యత్నం సబ్‌జైలులో ఉన్న వారికి,క్షతగాత్రులకు అండగా ఉంటాం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
సత్తెనపల్లి: రాజధాని ప్రాంతమైన పెదకూరపాడు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా టీడీపీ మూకలు అడ్డుకున్నారని, ఒక్క నామినేషన్ కూడా పడలేదని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. అక్రమ కేసులో క్రోసూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన తొమ్మిది మంది వైఎస్సార్ సీపీ నాయకులు సబ్‌జైలు ఉండటంతో శనివారం వారిని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సబ్‌జైలు ఎదుట మీడియాతో ఆయన మాట్లాడారు. శంకరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి నామినేషన్ సెంటర్‌లో రౌడీలని, గుండాలని తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని నామినేషన్ వేయనివ్వకుండా గొడవలు, దాడులు, కిడ్నాప్‌లు చేయడం, రోడ్డు మీదకు వెళితే.. కార్లలో ఎత్తుకొని పోవడం చేస్తున్నారన్నారు. ఈ ఘటనలన్నీ చూస్తుంటే.. మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా, లేక బిహార్‌లో ఉన్నామో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.
టీడీపీ గూండాలకు ఖాకీల వత్తాసు
అధికార పార్టీనేతలు పోలీస్ శాఖ అండతో బయట నుంచి రౌడీలను తీసుకొచ్చి కొడితే వైఎస్సార్ సీపీ నేతలు చాలామంది తలలు పగిలి హాస్పిటల్‌లో ఉండటం బాధాకరమైన విషయమన్నారు. ఇలాంటి పరిస్ధితులు గతంలో ఎప్పుడూ రాలేదదన్నారు. దాడులకు గురైన తమవారిపైనే 307 సెక్షన్ల కింద కేసులు పెట్టి జైల్లో వేయడం అత్యంత దారుణమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇప్పటికై నా టీడీపీ నేతలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. మునగోడు, ఊటుకూరు, చింతపల్లిలో తమ నేతలను అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు.
హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా..
హైకోర్టు ఆర్డర్ తెచ్చినా కూడా నామినేషన్లు వేయనివ్వకుండా తమ అభ్యర్థులను టీడీపీ రౌడీలు అడ్డుకుంటున్నారన్నారు. ఆఖరికి సత్తెనపల్లి ఆర్వో ఆఫీస్‌లో కూడా నామినేషన్లు వేయనివ్వకుండా వెనక్కి పంపిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్ధం చేసుకోవాలన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సైతం ఇదే పద్ధతిలో నామినేషన్లు వేయ నివ్వకుండా చేస్తున్నారని ఇది అత్యంత దారుణమన్నారు. ఇటువంటి దారుణమైన రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, రేపు అందరూ ఇదే బాటలో నడుస్తారనే విషయం ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని హెచ్చరించారు. ఆయనతో పాటు సీనియర్ న్యాయవాది అంకాళ్ల వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు ఈదా సాంబిరెడ్డి, విప్పల వెంకట్రామిరెడ్డి, అనుముల రోసిరెడ్డి, పరస శివ, పోతురాజు శ్రీనివాస్ (పట్టీలు), అనంతవరంకు చెందిన అక్రమ కేసులోని బాధితుల బంధువులు ఉన్నారు.


