మాచర్ల: నియోజకవర్గంలో 77 గ్రామ పంచాయతీలకు ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ ప్రక్రియ జరుగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున ఏ ఒక్కరు గ్రామపంచాయతీల్లో పోటీ చేయకుండా టీడీపీ నాయకులు కుట్రకు తెరలేపారు. అందులో భాగంగా వారం రోజులుగా పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ గుండాలు వైఎస్సార్ సీపీ నాయకులపై బైండోవర్ కేసులు పెట్టించారు. అన్నిరకాలుగా ఆటంకాలు సృష్టిస్తూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్ని మండలాల నాయకులతో ఎన్నికల విషయమై చర్చించారు. టీడీపీ గుండాలు పీఆర్కేపై నిఘా పెట్టి, ఆయన కదలికలను గమనిస్తూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఇంటి నుంచి బయటకు రానీయకుండా చేశారు. శుక్రవారం రాత్రి మాచర్ల రూరల్ సీఐ వేణు పీఆర్కేతో చర్చించారు. రాత్రి ఆయన ఇంటివద్ద పోలీసులను ఏర్పాటు చేశారు. పీఆర్కేను ఇంట్లో నుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు. శనివారం ఉదయం పీఆర్కే నివాసం ఉండే ప్రాంతంలో రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవకుండా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మాచర్ల పట్టణ ఎస్‌ఐ వెంకట్రావు, ఏఎస్‌ఐ ప్రభుదాసు, స్పెషల్ పోలీసు సిబ్బంది శనివారం ఉదయం నుంచి బందోబస్తు నిర్వహించారు. పీఆర్కేను హౌస్ అరెస్ట్ చేసినట్లు నోటీసు ఇచ్చారు.
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెనపాముల కలకలం రేపాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్‌రోడ్‌లోని సచివాలయం పక్కన పార్కు వాకింగ్ ట్రాక్ సమీపంలో పెనపాములు ప్రత్యక్షమయ్యాయి. అవి రెండు కొంతసేపు సయ్యాటలో మునిగిపోవడం రాకపోకలు సాగిస్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతంలో పెనపాములు కనిపించడంతో ఒక్కసారిగా ప్రజలు అప్ర మత్తమయ్యారు. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు వావిలాల గోపాలకృష్ణయ్య మెమోరియల్ స్మృతివనంను సందర్శిస్తుంటారు. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పెనపాముల విహార ఘటనలు చోటు చేసుకోవడం ప్రజలను మరింత భయానికి గురిచేస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజలకు ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, జనసంచార సమీపంలో మదుగులు లేకుండా పాముల రాకకు అవకాశం లేని విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


