పల్నాడు జిల్లాలో నామినేషన్లు వేయకుండా అడ్డుకునేలా ఏర్పాట్లు టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లోనే నామినేషన్ కేంద్రాలు అన్ని గ్రామాల అభ్యర్థులు ఇక్కడే దాఖలు చేసేలా పథక రచన ఏకగ్రీవాలు చేస్తామంటూ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సర్పంచ్ పదవులకు వేలంపాటలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి పాలకులు
గుంటూరు, బాపట్లలో రూటు మార్చి..
చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతోంది. పల్లెపోరులోనూ టీడీపీ కుతంత్రాలు తెరలేపింది. దౌర్జన్యాలు, బెదిరింపులు, పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు తెగబడుతూనే ఉంది. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా, ప్రజా తీర్పును పూర్తిగా పక్కనపెట్టి నేరుగా పదవులు కైవసం చేసుకునేందుకు కూటమి నేతలు కుట్రలకు పాల్పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి చెలరేగిపోతోంది. అధికారులతో తప్పులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల నుంచి మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి నేతల అరాచకాలకు అంతే లేకుండా పోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు బరితెగించి వైఎస్సార్ సీపీ నేతలపై దాడులకు తెగబడటం అందరూ చూశారు. చివరకు మహిళలపై సైతం దాష్టీకాలకు పాల్పడ్డారు. దాడులు చేయడం, చీరలు లాగి దుశ్శాసన పర్వానికి తెరతీశారు. గుంటూరు, బాపట్ల జిల్లాలతోపాటు ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం స్పష్టంగా తెలుస్తోంది. దీన్ని ముందుగానే గ్రహించిన అధికార పార్టీ నేతలు.. నామినేషన్లు దాఖలైతే ఇక తమ ఓటమి తప్పదనే భయంతో ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు తెగబడ్డారు. అదే రీతిలో పంచాయతీ ఎన్నికలను సైతం పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవాలనే దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరిస్తున్నారు. సర్పంచ్ స్థానాల్లో తమ పార్టీ గూండాలను కూర్చోబెట్టేందుకు ఇప్పటికే పథక రచన చేశారు.
పట్టున్న గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా, గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించే వారిని ఎన్నుకుంటారు. పార్టీలకతీతంగా మంచి నాయకుడిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేకుండా చేశారు. ఈ ఎన్నికలను సైతం కలుషితం చేస్తూ, కేవలం టీడీపీ నేతలనే సర్పంచ్ స్థానాల్లో కూర్చోబెట్టాలనే దురుద్దేశంతో అడుగులు వేస్తోంది. కూటమికి బలమైన గ్రామాలతోపాటు, టీడీపీ సామాజిక వర్గం అధికంగా ఉండే గ్రామాలను నాయకులు ఎంచుకుంటున్నారు. అక్కడే ఇతర గ్రామాలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. తద్వారా ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా చేయాలనేదే వారి కుట్ర. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఇలా ఏర్పాటు చేసేలా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండే గ్రామాల నుంచి సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు టీడీపీకి బలమైన గ్రామాల్లోకి వెళ్లి నామినేషన్లు దాఖలు చేసేలా కుయుక్తులు పన్నారు. నామినేషన్ల రోజున టీడీపీ గూండాలు నామినేషన్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని కర్రలు, రాడ్లతో హల్చల్ చేస్తూ నామినేషన్లు పడకుండా చేయాలనేది ప్రథమ కుట్ర. అప్పటికీ వినని వారిపై పోలీసులను ప్రయోగించి అక్రమ కేసులు నమోదు చేసి, బెదిరింపులకు పాల్పడేలా అక్రమాలకు తెరతీశారు. అందులో భాగంగా ఇప్పటికే బైండోవర్ల పేరుతో అనేక మంది వైఎస్సార్ సీపీ నాయకుల పేర్లను గ్రామాల వారీగా టీడీపీ నేతలు ఆయా పోలీసు అధికారులకు ఇచ్చినట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియ నుంచి పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు వీరందరినీ పోలీసులు అక్రమంగా నిర్బంధించి పోటీలో లేకుండా చేయాలనేది టీడీపీ, పోలీసులు కలిసి పన్నిన కుట్రగా తెలిసింది. పారదర్శకంగా ఎక్కడి నామినేషన్లు అక్కడే వేసుకునేలా చూడాల్సిన ఆర్డీవోలు, చివరకు కలెక్టర్ సైతం కూటమి కుట్రలో భాగం కావడం చూస్తుంటే ప్రజాస్వామ్యం అసలు ఉందా అనే చర్చ ప్రజల్లో సాగుతోంది.
పల్నాడు జిల్లాలో దౌర్జన్యాలు, బెదిరింపులతో కూటమి నేతలు పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందాలని కుట్రలు చేస్తున్నారు. గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ కొత్త ట్రెండ్ సృష్టించారు. అందులో భాగంగా భారీ మొత్తంలో డబ్బులు పెట్టేవారిని రంగంలోకి దించి, వేలం పాటల పేరుతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలోని చల్లవారిపాలెం గ్రామ సర్పంచ్ పదవిని రూ.2.30 కోట్లకు వేలం పాటలో దక్కించుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేలం పాట చీరాల ఎమ్మెల్యే కొండయ్య నేతృత్వంలో జరగడం గమనార్హం. అక్కడ ఉపసర్పంచ్ పదవిని సైతం వేలం పాటలోనే దక్కించుకున్న పరిస్థితి. బాపట్ల జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు కూడా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు. దీనికి గ్రామాభివృద్ధి కోసం అని సాకు చూపి, ఎమ్మెల్యే అనుయాయులను సర్పంచ్ పదవుల్లో కూర్చోబెట్టేందుకు ప్రలోభాలకు దిగుతున్నారు. దీనికి ఎవరైనా అడ్డుపడితే వెంటనే పచ్చచొక్కాలు వేసుకున్న ఖాకీలు రంగంలోకి దిగి, వారిని బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్లెపోరును పచ్చపార్టీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలతో తమ పార్టీ నేతలను అందలం ఎక్కించేందుకు ఇప్పటికే అన్ని విధాలా రంగం సిద్ధం చేసేశారు.
అడ్డదారుల్లో గెలవడానికి చంద్రబాబు సర్కార్ కుట్రలు


