అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం నాగులచవితి సందర్భంగా భక్తులు నాగేంద్రుని పుట్ట వద్ద పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం వేకువజామున భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు ఆచరించి, ఆలయంలోని ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం వద్ద, తూర్పు గాలిగోపురం వద్ద ఉన్న నాగేంద్రుని పుట్టలలో పాలు పోసి పూజలు చేశారు. నాగేంద్రునికి ఇష్టమైన నువ్వులపిండి, ఆవుపాలు, అరటిపండ్లు, చలిమిడి తదితర పదార్థాలను పుట్టలో వేసి దీపారాధనలు చేసి పూజలు నిర్వహించారు. పుట్టమట్టిని పిల్లల చెవులకు పెట్టి నాగేంద్రుని స్తోత్రాలను పఠించారు. పుట్టమట్టిని పెట్టుకోవడం వల్ల పిల్లలకు వచ్చే చెవికి సంబంధించిన వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ నాగులచవితి విశిష్టతను వివరించారు. కార్తికమాసంలో నాలుగో రోజున వచ్చే చవితిని నాగులచవితిగా ఆచరిస్తామని తెలిపారు. సర్పదేవతలను నాగేంద్రునిగా పూజించే సంప్రదాయం హిందువులకు ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం వరకు పలు గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు.


