ఎమ్మెల్యే కార్యాలయానికి నామినేషన్‌ పత్రాలు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కార్యాలయానికి నామినేషన్‌ పత్రాలు

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

150 పత్రాలను నిబంధనలకు విరుద్ధంగా తరలించిన వైనం

ప్రణాళిక విభాగం అధికారి స్వయంగా తీసుకెళ్లి అప్పగింత

పారదర్శకంగా సాగాల్సిన

ఎన్నికల ప్రక్రియకు తూట్లు

సామాన్యులకు చుక్కలు.. అధికార పార్టీ వారికి మర్యాదలు

అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

నరసరావుపేట టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకముందే అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికార యంత్రాంగం.. అధికార పార్టీ నేతల ఆదేశాలకు తలొగ్గుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నామినేషన్‌ దరఖాస్తులను అభ్యర్థులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు.. ఏకంగా 150 సెట్లను అధికార పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసరావుపేటలో రెండో విడత మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 26న పోలింగ్‌, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో చైర్మన్‌ పదవి మొదలు కౌన్సిలర్‌ స్థానాల వరకు పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు.

అధికార పార్టీకి ప్రత్యేక ఏర్పాట్లు

ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటంతో నామినేషన్‌ పత్రాల కోసం శుక్రవారం నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయానికి ఆశావహులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు ఫోన్‌ చేసి నామినేషన్‌ పత్రాలను టీడీపీ కార్యాలయానికి పంపించాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అధికారి సుమారు 150 నామినేషన్‌ పత్రాలను స్వయంగా తీసుకెళ్లి టీడీపీ కార్యాలయంలో అప్పగించినట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు అందజేయడం తీవ్ర చర్చకు దారితీసింది. సాధారణంగా అభ్యర్థులందరికీ అందుబాటులో ఉండాల్సిన నామినేషన్‌ పత్రాలు ఒక పార్టీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో చేరడం వెనుక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కార్యాలయంలో దరఖాస్తుల కొరత

మరోవైపు మున్సిపల్‌ కార్యాలయానికి నామినేషన్‌ పత్రాల కోసం వచ్చిన ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర ఆశావహులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు బయటకు వెళ్లడంతో కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఫారాలపై ఒత్తిడి ఏర్పడింది. దరఖాస్తుల కోసం వచ్చిన వారు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీకి చెందిన వారికి పెద్ద మొత్తంలో ఫారాలు అందుబాటులోకి వస్తే.. మిగిలిన అభ్యర్థులు మాత్రం మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎన్నికల ప్రక్రియలో అధికారులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాలి. నామినేషన్‌ పత్రాల పంపిణీ నుంచి పోలింగ్‌, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశ పారదర్శకంగా ఉండాలి. కానీ, ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఒక రాజకీయ పార్టీ కార్యాలయానికి అధికారి స్వయంగా వెళ్లి దరఖాస్తులు అందజేయడం అధికారుల నిష్పక్షపాత వైఖరిపై సందేహాలు రేకెత్తిస్తోంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పంపిణీ జరిగిందా? లేక రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గారా? అన్నది తేలాల్సి ఉంది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న మున్సిపల్‌ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా సాగాల్సిన అవసరం ఉంది. కానీ, నామినేషన్ల దశలోనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే మిగిలిన ఎన్నికల ప్రక్రియ ఎంత పారదర్శకంగా సాగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకులు స్పందించి విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement