వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఖాజావలి మాస్టారు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఖాజావలి మాస్టారు

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

విజయకీలాద్రిపై ప్రత్యేక పూజలు అంబేడ్కర్‌ భవన్‌కు రూ.4 కోట్లు కేటాయింపు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన

పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం

నరసరావుపేట: నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా పార్టీ సీనియర్‌ నాయకుడు, రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు షేక్‌ ఖాజావలి మాస్టారును ప్రతిపాదిస్తూ పార్టీ అధిష్ఠానానికి సమాచారం పంపినట్లు పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖాజావలి శుక్రవారం సాయంత్రం పట్టణంలోని బ్యాంకు స్ట్రీట్‌తోపాటు పలు ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించారు. ప్రతి పౌరుడిని కలిసి తనకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శుక్రవారం మణవాళ మహామునులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి మంగళాశాసనాలతో శ్రీ మణవాళ మహామునుల తిరు నక్షత్ర సందర్భంగా అభిషేకం, సేవాకాలం, ఉపదేశ రత్నమాల, తిరునక్షత్ర తనియన్‌ విన్నపం, ఆలయ మర్యాద సమర్పణ, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. అభిషేక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు.

నెహ్రూనగర్‌: గుంటూరు అర్బన్‌లోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ భవన్‌ కమ్‌ స్టడీ సర్కిల్‌లో గ్రంథాలయ హాల్‌తో పాటు ఇతర అధునాతన వసతుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ జీవో విడుదల చేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌, జిల్లా మేజిస్ట్రేట్‌ గత నెల అక్టోబర్‌ 24వ తేదీన ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక, అంచనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు అర్బన్‌లోని ఇందులో లైబ్రరీ హాల్‌తో కూడిన రెండు అంతస్తుల నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ బడ్జెట్‌లోని అందుబాటులో ఉన్న హెడ్‌ క్యాపిటల్‌ వర్క్స్‌ నిధుల నుంచి ఈ మొత్తాన్ని కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఈ పనులకు సంబంధించి తదుపరి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

అమరావతి: ప్రజలు అందరూ సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలనే సంకల్పంతో దాతల సహకారంతో శుక్రవారం అమరావతిలోని అమరేశ్వరాలయంలో స్వామికి లక్ష బిల్వార్చనను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేదపండితులు జరిపించారు. తొలుత మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. గణపతి హోమం చేశారు. స్వామి వారికి విశేష అలంకరణ అనంతరం సహస్రనామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన నిర్వహించారు. బాలచాముండేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ మాట్లాడుతూ పవిత్ర కార్తిక మాసంలో పరమశివుడిని ఆరాధించి లక్ష బిల్వార్చన, బాల చాముండేశ్వరిదేవికి కుంకుమార్చన చేస్తే శుభాలు కలుగుతాయన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement