జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం జనసేనకే..?
పల్నాడు జెడ్పీ చైర్మన్‌కు టీడీపీలో విపరీతమైన పోటీ
పీఠంపై ఓ సామాజిక వర్గం కన్ను
ఓసీ మహిళకు రావడంతో తమవారి కోసం టీడీపీ నేతల యత్నాలు
తమ అనుచరులకు జెడ్పీ చైర్మన్ ఇప్పించుకునేందుకు ఎమ్మెల్యేల పైరవీలు
నల్లపాటి కీర్తనకు జెడ్పీ చైర్మన్ కోసం భాష్యం ప్రవీణ్ తీవ్ర యత్నం
పోటీలో ఉన్న వారందరికీ హామీలు ఇస్తున్న ఎంపీ లావు
జనసేనకు చెందిన ముప్పాళ్ళ జెడ్పీటీసీ బి.అనితకు పదవి దక్కే అవకాశం
భారీస్థాయి ఆఫర్ ఇవ్వడంతో జనసేనకు ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధిష్టానం!
సాక్షిప్రతినిధి, గుంటూరు: పల్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం కోసం కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతిపెద్ద జెడ్పీగా ఉన్న పల్నాడు జెడ్పీ చైర్మన్ కోసం పోటీ అధికంగా ఉంది. పోటీ పడేవారంతా సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరిని అవకాశం వరిస్తుందో అనే చర్చ తీవ్ర స్థాయిలో నడుస్తుంది. ప్రధానంగా టీడీపీ, జనసేనల మధ్యే జెడ్పీ పీఠం పోటీ నడుస్తుంది. పోటీ పడేవారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు కావడంతో వీరిలో ఒకొక్కరిని ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే భుజాన వేసుకుని జెడ్పీ చైర్మన్‌ను చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రధానంగా టీడీపీలో ముగ్గురు, జనసేన నుంచి ఒకరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు నడుస్తుంది. టీడీపీ సీనియర్లు ఒకవైపు, చిన్నబాబు వర్గంగా ఉన్న జూనియర్ ఎమ్మెల్యే మరోవైపు ఉండి తమ సత్తా చాటేందుకు జెడ్పీ పీఠాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేస్తున్నారు. ఎంత ఖర్చయినా సరే పెట్టి జెడ్పీ పీఠాన్ని తమ అనుచరులకు ఇప్పించుకోవాలని పట్టుదలతో అధిష్టానం దగ్గర తమ వాదనలు వినిపిస్తున్నారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో మొదటి జెడ్పీ చైర్మన్‌గా తమవారే ఉండాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
పీఠం కోసం పోటాపోటీ!
జెడ్పీ చైర్మన్ పీఠం కోసం ముగ్గురు వైద్యులతోపాటు, మరో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరిలో పిడుగురాళ్లకు చెందిన ఉన్నం నాగమల్లికార్జునరావు సతీమణి డాక్టర్ ఉన్నం దీపిక పిడుగురాళ్ల జెడ్పీటీసీగా గెలుపొంది రేసులో ఉన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాత్రం దీపిక జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపికకు అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. నాగమల్లికార్జునరావు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనుచరుడు కావడంతో ఆయన మద్దతుతో జెడ్పీ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీడీపీలో జెడ్పీ పీఠం కోసం ఒకేసామాజిక వర్గానికి చెందిన నలుగురు తీవ్ర స్థాయిలో పైరవీలు చేస్తుండగా పిట్టపోరు .. పిట్టపోరు పిల్లి తీర్చిన చందంగా వీరు ఓవైపు తన్నుకుంటుంటే జెడ్పీ పీఠాన్ని జనసేన కై వసం చేసుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. సత్తెనపల్లి నియోకవర్గం ముప్పాళ్ల మండల జెడ్పీటీసీగా ఎన్నికై న బొర్రా అనిత పల్నాడు జిల్లా జెడ్పీ పీఠంపై కూర్చునేందుకు మార్గం సుగుమమైనట్లు అటు జనసేన నేతలు, ఇటు టీడీపీ ముఖ్య నేతలు చెప్పుకొంటున్నారు. ఈమె సైతం కమ్మ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, ఈమె బావ బొర్రా అప్పారావు టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడంతో వాళ్లు సైతం ఈమెకు మద్దతు తెలిపినట్లు చెబుతున్నారు. మొదట్లో రుద్రవరం గ్రామానికి చెందిన యార్లగడ్డ బోసుబాబు టీడీపీ నుంచి ముప్పాళ్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్న సమయంలో హడావుడిగా అతనిని పోటీ నుంచి తప్పించి ఆస్థానాన్ని జనసేనకు కేటాయించి, అక్కడి నుంచి బొర్రా అనితను నామినేషన్ వేయించిన విషయం తెలిసిందే. అంటే ముందుగానే జనసేనకు జెడ్పీ పీఠం కేటాయిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి ఆమోదం ఇచ్చుకున్న తరువాతే బొర్రా అనితను పోటీలో దించినట్లు చెప్పుకొంటున్నారు. ఇందుకోసం ఆయన భారీ స్థాయి పైరవీ నడిపినట్లు సమాచారం. జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటగా జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పీఠాన్ని జనసేనకు కేటాయిస్తున్నారనే సమాచారంతో టీడీపీ కేడర్ గుర్రుగా ఉన్నారు.


