నగరంపాలెం: అగ్రిగోల్డ్ బాండ్స్ పరిశీలనలో భాగంగా మంగళవారం మంగళగిరి పట్టణానికి సంబంధించి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన నిర్వహించారు. సుమారు 1,208 దరఖాస్తులకు 2,384 బాండ్లలను పరిశీలించారు. ఈనెల 12–14, 16–18వ తేది వరకు తెనాలి పట్టణం, తెనాలి రూరల్, కొల్లిపర మండలాలకు సంబంధించి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన నిర్వహించనున్నట్లు సీఐడీ గుంటూరు ప్రాంతీయ అధికారి (ఏఎస్పీ) బి.సీతారామయ్య తెలిపారు. తెనాలి పట్టణం, తెనాలి రూరల్, కొల్లిపర మండలాల్లోని అగ్రిగోల్డ్ బాండుదారులు ఆయా తేదీల్లో గుంటూరు మెడికల్ కాలేజీ వెనుకనున్న గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని అన్నారు. ఒరిజినల్ బాండ్, చివరిసారి చెల్లించిన ఒరిజినల్ బాండ్ సంబంధించి ఒరిజినల్ రసీదు, ఆధార్, బ్యాంక్ పాస్ పుస్తకం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, జిరాక్స్‌లతో రావాలని తెలిపారు.
ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి వసతులపై విచారణ
నగరంపాలెం: గుంటూరు జిల్లా కారాగారంలో ఉన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తగు వసతులు కల్పించలేమని పేర్కొంటూ జైలు అధికారి దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి భద్రత కల్పించలేమని, మరో జైలుకి తరలించాలని కోర్టులో జైలు అధికారి పిటిషన్ వేశారు. జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ నిబంధనల ప్రకారం లేదని, ఆ పిటిషన్ కొట్టేయాలని లేళ్ల అప్పిరెడ్డి తరఫున న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి వాదన వినిపించారు. ఈ వాదన జరుగుతున్న సమయంలో రెండు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఉన్నట్లు సమాచారం ఉందని ప్రభుత్వ తరఫున పీపీ కోర్టుకి తెలియజేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శాంతి, భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో జిల్లాలోని వ్యక్తులను పరామర్శించారని, ఆ సమయంలో లేని శాంతిభద్రతల సమస్య ఇప్పుడు ఎలా వస్తుందని బ్రహ్మారెడ్డి ప్రశ్నించారు. భద్రత ఏర్పాట్లు పోలీసులకు సంబంధించి అంశం అని ఆయన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
బియ్యం విక్రయాలపై తనిఖీలు
గుంటూరు వెస్ట్: బియ్యం అధిక ధరలకు విక్రయిస్తున్న పలు దుకాణాలపై అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, తూనికలు కొలతలు అధికారి సైదా, విజిలెన్స్ కమిటీ మెంబర్ చదలవాడ హరిబాబు, అధికారులు స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలోని గ్రేట్ ఇండియా రైస్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు బియ్యం అమ్ముతున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా సోమవారం కూడా రెండు బియ్యం దుకాణాలపై తనిఖీలు నిర్వహించారు. కేసులు నమోదు చేయడంతోపాటు నగదు జరిమానా విధించారు. సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహసీల్దార్లు బేగ్, వెంకట్రావు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యాన స్థానిక అమరావతి రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సీనియర్ యువతీ, యువకుల ఫెన్సింగ్ పోటీలు నిర్వహిస్తామని జిల్లా కార్యదర్శి డి.అశోక్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 13 సంవత్సరాల వయస్సుదాటిన వారు పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన జట్టును ఈ నెల 15న కాకినాడలో జరిగే రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఇప్పటి వరకు ఫెన్సింగ్ గేమ్‌లో పాల్గొనని క్రీడాకారులు సర్టిఫైడ్ ఫెన్సింగ్ కోచ్ వద్ద కనీసం 6 నెలలు ఫెన్సింగ్ క్రీడలో శిక్షణ పొందిన సర్టిఫికెట్‌తోపాటు, జనన ధ్రువీకరణ పత్రం, ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపుకార్డు, ఆధార్, 2 పాస్‌ఫోర్ట్ సైజ్ ఫొటోలతోపాటు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 70755 08842 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.


