కూటమి బలంగా ఉన్న గ్రామాల్లోనే నామినేషన్ కేంద్రాలు
వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధం..
నరసరావుపేట రూరల్: అరాచకాలు, దౌర్జన్యాలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన తెలుగుదేశం కూటమి నాయకులు, ఇదే విధానాన్ని పంచాయతీ ఎన్నికల్లోను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాకముందే అక్రమాలకు తెరతీశారు. నామినేషన్ ప్రక్రియలోనే ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేసే ఎత్తుగడ వేస్తున్నారు. తమకు బలం ఉన్న చోట నామినేషన్ కేంద్రాలను ఏర్పాటుచేసే విధంగా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.
దౌర్జన్యకాండ
ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో సజావుగా ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని భావిస్తున్న టీడీపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రారంభం నుంచి అరచకాలనే నమ్ముకున్నారు. మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకున్నారు. నామినేషన్ల ప్రారంభం నుంచి దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు. నామినేషన్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుని ఇతరులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన వారిపై దాడులకు తెగబడ్డారు. పచ్చమూకల ఆగడాలు కళ్లముందే కనబడుతున్నా పోలీసులూ వారికే అండగా నిలిచారు. దీంతో జిల్లాలోని 28 మండలాల్లో అన్ని ఎంపీపీలను కూటమి ఏకగ్రీవం చేసుకుంది. నామినేషన్ ప్రక్రియలో దౌర్జన్యాలతో జెడ్పీ చైర్మన్‌ను కై వసం చేసుకుంది. జిల్లాలోని 28 జెడ్పీటీసీ స్థానాల్లో 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పది జెడ్పీటీసీ జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి.
అదే అరాచకానికి వ్యూహం..
పంచాయతీ ఎన్నికలకు ఈనెల 13వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మూడు విడతల్లో జిల్లాలోని 512 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గ్రామస్థాయిలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీ ఎదుర్కొనేందుకు కూటమి నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నామినేషన్ ప్రక్రియలోనే వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపే అభ్యర్థులను అడ్డుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తమకు బలం ఉన్న గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసేవిధంగా కూటమి నాయకులు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
కార్తిక మాసం తొలిరోజు
కోటప్పకొండలో భక్తుల రద్దీ
నరసరావుపేట మండలంలోని నామినేషన్ కేంద్రాల వివరాలను వెల్లడించేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదు. మండలంలో వైఎస్సార్ సీపీకి బలంగా ఉన్న గ్రామాలకు సంబంధించిన నామినేషన్ కేంద్రాలను కూటమి పార్టీ బలంగా ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నారు. దొండపాడు పంచాయతీ నామినేషన్ కేంద్రం గతంలో జొన్నలగడ్డలో ఉండేది. ఇప్పుడు దీనిని పమిడిపాడులో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. దొండపాడు నుంచి పమిడిపాడుకు పది కిలోమీటర్ల వరకు దూరం ఉంది. కూటమి పార్టీ బలంగా ఉన్న పమిడిపాడులో నామినేషన్ కేంద్రం పెట్టి ఇతర గ్రామాల వారిని రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. అలాగే యల్లమంద, కాకాని, రావిపాడు, కేసానుపల్లి తదితర గ్రామాల్లో ఇదే తీరుగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రొంపిచర్ల మండలం కర్లకుంట గ్రామం మారుమూలన ఉంటుంది. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. కూటమి బలంగా ఉందనే ఒక్క కారణంతోనే ఇక్కడ నాలుగు గ్రామాలకు నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం బుచ్చిపాపన్నపాలెం గ్రామానికి సంబంధించిన నామినేషన్లు ఇక్కడే దాఖలు చేయాల్సి ఉంది. ముత్తనపల్లిలో మునమాక, వడ్లమూడివారిపాలెం, విప్పర్లపల్లికి చెందిన నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగంగా కనిపిస్తుంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ సాధించిన విజయాలు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు చేస్తున్న అరాచకాలు, అక్రమాలను అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతుంది. ఇప్పటికే గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి సర్పంచ్ల అభ్యర్థుల ఎంపికలను చేపట్టింది. ఇది తుదిదశకు చేరుకున్నట్టు సమాచారం. నామినేషన్ కేంద్రాల మార్పుపై వైఎస్సార్ సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


