నరసరావుపేట: జనాభా గణన రెండో దశను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఇన్చార్టి అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్, ప్రధాన జనగణన అధికారి డాక్టర్ కృతికా శుక్లా సూచించారు. డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపఽథ్యంలో స్వీయగణనకు ప్రజల భాగస్వామ్యం పెంపొందించేందుకు కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశాభివృద్ధికి అవసరమైన ప్రణాళిక రూపకల్పన, విధాన నిర్ణయాలు, నిధులు, వనరుల కేటాయింపులో జనగణన ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. పట్టణ జనాభా, వలస జనాభా, నిరాశ్రయులు, ఖాళీగా ఉన్న, తాళం వేసి ఉన్న గృహాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఎవరినీ మినహాయించకుండా ప్రతి వ్యక్తి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ద్వారా జనాభా సామాజిక, ఆర్థిక వలసలు, సంతానోత్పత్తి సంబంధిత వివరాలు సేకరించనున్నందున ప్రతి ప్రశ్న, సంబంధిత మార్గదర్శకాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వ్యక్తిగత సమాచార గోప్యతను కాపాడుతూ డిజిటల్ సాధనాలను సమర్ధవంతంగా వినియోగించేందుకు అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర జనగణన అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దెయ్య, జిల్లా గణన ఇన్చార్జి, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్, ప్రధాన జనగణన అధికారి డాక్టర్ కృతికా శుక్లా


