కల్తీ నూనె.. అడ్డుకట్ట పడేనా? | - | Sakshi
Sakshi News home page

కల్తీ నూనె.. అడ్డుకట్ట పడేనా?

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

ఆరోగ్యానికి ముప్పు..

● భక్తుల విశ్వాసమే

అక్రమార్కులకు పెట్టుబడి

● నరసరావుపేట కేంద్రంగా

రూ.కోట్లలో వ్యాపారం

● పండుగ సీజన్‌ను సొమ్ము

చేసుకుంటున్న అక్రమార్కులు

● బ్రాండెడ్‌ ముసుగులో నాసిరకం

నూనెల విక్రయాలు

నరసరావుపేట టౌన్‌: కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లు అక్రమార్కులు దీపారాధన నూనెను కల్తీ చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు వ్యాపారం మాటున దోపిడీకి పాల్పడుతున్నారు. దుకాణాల్లో కొనుగోలు చేస్తున్న నూనెల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. పూజా కార్యక్రమాల్లో వినియోగించాల్సిన సంప్రదాయ నూనెలకు బదులుగా వ్యాపారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. నాసిరకం నూనెలను డబ్బాల్లో నింపి భక్తులకు అంటగడుతున్నారు. ప్రధానంగా దీపావళి, కార్తీక మాసం, సంక్రాంతి, మహాశివరాత్రి వంటి పవిత్ర పండుగల సందర్భంగా ఆలయాలు, గృహాల్లోని పూజా గదుల్లో దీపాలు వెలిగించడం పరిపాటి. భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని వ్యాపారులు కల్తీలకు పాల్పడుతున్నారు.

కల్తీలకు చిరునామాగా..

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట కల్తీలకు కేంద్రబిందువుగా మారింది. ఇక్కడ ఔషధాలు, వంట నూనెలను పెద్దఎత్తున కల్తీ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పండుగల సీజన్‌ కావడంతో పూజా నూనెలకు ఉన్న డిమాండ్‌ను అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా యూనిట్లను ఏర్పాటు చేసి నూనెలను ప్యాకింగ్‌ చేస్తున్నారు. జీఎస్టీ, వ్యాపార అనుమతులు లేకుండా నాన్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ పేరుతో దీపారాధన నూనెను ప్యాకింగ్‌ చేసి మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నారు. వాటిని అక్రమంగా ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. తక్కువ ధరకు లభించే నాసిరకం నూనెలను అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు లాభాలు గడిస్తున్నారు.

నాసిరకం నూనెతో మోసం..

ప్రస్తుతం దీపావళి, కార్తిక మాసం సీజన్‌ కావడంతో పూజా నూనెను అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. దీపారాధన నూనె తయారీలో నాణ్యమైన నువ్వుల నూనె, వేరుశనగ నూనె వంటి వాటికి బదులుగా తక్కువ గ్రేడ్‌కు చెందిన నాసిరకం వేరుశనగ నూనెను వినియోగిస్తున్నారు. కొన్ని యూనిట్లలో వివిధ రకాల పారిశ్రామిక, ఇతర అవసరాలకు సంబంధించిన నూనెలను శుద్ధి చేసినట్లు చూపించి, రంగులు కలిపి పూజా నూనెలుగా విక్రయిస్తున్నారు. బ్రాండెడ్‌ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా లేబుళ్లను వేస్తున్నారు. వాటిపై నాన్‌ ఎడిబుల్‌ రైస్‌ బ్రాన్‌ (ఆర్‌బీ) ఆయిల్‌గా ముద్రిస్తున్నారు. దీంతో నమూనాలు తీసి పరీక్షించాలన్న ఆలోచన లేకుండా అధికారులను సైతం మభ్యపెడుతున్నారు. నువ్వుల నూనెగా నమ్మించి భక్తులను మోసం చేస్తున్నారు.

పూజా గదుల్లో, దేవాలయాల్లో గంటల తరబడి దీపాలు వెలిగించడం సర్వసాధారణం. ఈ క్రమంలో కల్తీ నూనె నుంచి వెలువడే పొగ, రసాయనాల ప్రభావంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గాలి నాణ్యత దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అధికారులు స్పందించి కల్తీ నూనెల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భక్తుల విశ్వాసంతో ఆడుకుంటున్న కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపకపోతే దీపారాధన పేరుతో జరుగుతున్న దోపిడీ మరింత విస్తరించే ప్రమాదం ఉంది.

భక్తితో వెలిగించే దీపాల్లోనూ కల్తీ చీకట్లు కమ్ముకుంటున్నాయి. దేవుడి ముందు దీపం వెలిగిస్తే ఇంటిల్లిపాదికీ శుభం కలుగుతుందని విశ్వసించే భక్తుల నమ్మకమే అక్రమార్కులకు వ్యాపార పెట్టుబడిగా మారుతోంది. పూజా సామగ్రి ముసుగులో నాసిరకం నూనెలను అంటగట్టి అందినకాడికి దండుకుంటున్నారు. పండుగ వేళల్లో వెలుగులు నింపాల్సిన దీపారాధన నూనె ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement