కోటప్పకొండ ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

కోటప్పకొండ ఘాట్‌రోడ్డు పునరుద్ధరణ ప్రత్యేక రోజుల్లో అభిషేకాలు నిలిపివేత వరకట్నం దురాచారం ‘కూచిపూడి’ కోర్సులలో ప్రవేశానికి ఇంటర్వ్యూలు

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ ఘాట్‌ రోడ్డులో రాకపోకలను శుక్రవారం పునరుద్ధరించారు. మురసు తుపాను కోటప్పకొండలో బీభత్సం సృష్టించింది. ఘాట్‌రోడ్డులో పలుచోట్ల చెట్లు, కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు రోజులుగా చెట్లు, బండరాళ్లను తొలగించే ప్రక్రియ చేపట్టిన అధికారులు గురువారం పనులు పూర్తిచేశారు. వాహనాల రాకపోకలను శుక్రవారం అనుమతించారు. పర్యాటక కేంద్రం సమీపంలో ఘాట్‌రోడ్డు భారీ కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రోడ్డు మార్జిన్‌లోని మట్టి కొతకు గురైంది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలోని చెట్లు నేలకొరిగాయి. ప్రధాన ఆలయం వెనుక ఉన్న భారీ రావి చెట్టు నేలకొరిగింది. ధ్యానశివుడి వద్దకు వెళ్లే దారిలోని రేకులు భారీ గాలులకు ఎగిరిపడ్డాయి. అన్నదాన మండపం వద్ద ఉన్న వాటర్‌ప్లాంట్‌ పూర్తిగా ధ్వంసమైంది. ఘాట్‌రోడ్డులోని ప్రకృతి పర్యావరణ కేంద్రంలో గాలుల బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి. పర్యాటకుల అనుమతిని నిలిపివేశారు. కొండ దిగువున ఉన్న సామాజిక అటవీ శాఖ నర్సరీలో భారీ వృక్షాలు నేలకొరిగాయి.

నరసరావుపేట రూరల్‌: కార్తిక మాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రోజుల్లో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి మూలవిరాట్‌ అభిషేకాలను నిలిపివేస్తున్నట్టు ఈవో డి.చంద్రశేఖర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆది, సోమవారాలతోపాటు ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి రోజుల్లో మూలవిరాట్‌ అభిషేకాలు నిలిపివేసి.. అభిషేక మండపంలో నిర్వహిస్తారని తెలిపారు. మిగిలిన రోజుల్లో యథావిధిగా మూలవిరాట్‌ అభిషేకాలు జరుగుతాయని వివరించారు. కార్తిక మాస పరోక్ష అభిషేక టికెట్లు పట్టణంలో పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్టు తెలిపారు.

గుంటూరు లీగల్‌: వరకట్నం చట్ట పరమైన నేరం అని, తీవ్రమైన సామాజిక దురాచారం కూడా అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్‌ చక్రవర్తి ఉత్తర్వుల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్‌ మాట్లాడుతూ వివాహం అనేది వ్యాపార లావాదేవీ కాదని చెప్పారు. మహిళ ఒక వస్తువు కాదని తెలిపారు. గౌరవం, స్వేచ్ఛ, సమాన హక్కులు కలిగిన వ్యక్తిగా జీవించే హక్కు ఆమెకు ఉందని అన్నారు. శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పి.వి.రాజీవ్‌ మాట్లాడుతూ మహిళలకు చట్టం కల్పించిన రక్షణ గురించి వివరించారు. ప్రజలకు న్యాయ సహాయం అందించడం, న్యాయ సేవలపై అవగాహన పెంచడం, కట్న నిషేధం, లింగ సమానత్వంపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీస్‌ శాఖ ప్రతినిధులు, న్యాయవాదులు, పారా లీగల్‌ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో గల కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర యోగి నాట్య కళాపీఠం ప్రాంగణంలో శుక్రవారం పలు కోర్సుల ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. నాట్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు దాఖలు చేసుకున్న విద్యార్థులకు వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చింతా రవి బాలకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్‌ వేదాంతం రాధేశ్యామ్‌, డాక్టర్‌ ఏలేశ్వరపు శ్రీనివాసులు(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌), పసుమర్తి హరినాథశాస్త్రి (టీచింగ్‌ అసిస్టెంట్‌) ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్టిఫికెట్‌ కోర్సుకు 44, డిప్లొమాకు 22, యక్షగానానికి 6, సాత్విక అభినయానికి 8, ఎంపీఏకు 17 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని వైస్‌ ప్రిన్సిపాల్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement