మాచర్ల పల్నాడు జిల్లాలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు బుధవారం హౌస్ అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్దకు ఉదయాన్నే పట్టణ ఎస్‌ఐ వెంకట్రావు, పోలీసు సిబ్బంది చేరుకొని సాయంత్రం వరకు హౌస్ అరెస్టులో ఉంచారు.
కాసు మహేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పిడుగురాళ్ల: పిడుగురాళ్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిద్రిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డిని అర్దరాత్రి సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు మహేష్‌రెడ్డి నిద్రించే ప్రాంతానికి వెళ్లారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, నరసరావుపేట వెళ్లాలని కాసుకు సూచించారు. తన వల్ల ఎలాంటి ఇబ్బంది జరగదని మహేష్‌రెడ్డి పోలీసులకు చెప్పినప్పటికీ వినకుండా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నరసరావుపేటలోని ఆయన స్వగృహానికి పంపించి, స్థానిక పోలీస్ అధికారులకు అప్పగించారు. అనంతరం కాసుని బయటకు రాకుండా నరసరావుపేట పోలీ సులు హౌస్ అరెస్టు చేశారు.
డాక్టర్ గోపిరెడ్డి హౌస్ అరెస్టు
నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన రొంపిచర్లలో పార్టీ ఎంపీటీసీ అభ్యర్ధుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పేటకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దచెరువులో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకొని ఇంట్లో వదిలిపెట్టి హౌస్ అరెస్టు చేస్తున్నామని, తమ అనుమతిలేకుండా బయటకు వెళ్లొద్దంటూ కోరారు. కాగా, గురువారం రొంపిచర్ల ఎంపీటీసీ అభ్యర్ధుల నామినేషన్లను తామే స్వయంగా వేయిస్తామంటూ డాక్టర్ గోపిరెడ్డికి హామీ ఇచ్చి ఆందోళనను విరమింపచేసిన పోలీసులు తీరా ఆయనను హౌస్ అరెస్టు చేయటం గమనార్హం.
అర్థరాత్రి వేళ అదుపులోకి ...
రొంపిచర్ల: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని మండలంలోని పలు వైఎస్సార్‌సీపీ నాయకులను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి సమయంలో ఇళ్లల్లో నిద్రిస్తున్న నాయకులను వాహనాల్లో తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, రొంపిచర్ల మాజీ సర్పంచ్ గెల్లి చిన్న కోటిరెడ్డి, మేడికొండ వీరారెడ్డి, గొట్టం వీరారెడ్డి, పోతులూరి సుబ్బారెడ్డి, గజ్జల ముసలారెడ్డి, కె. వెంకట కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.
నంబూరు శంకరరావు హౌస్ అరెస్ట్
పెదకూరపాడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావును గుంటూరులోని తన నివాసంలో బుధవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఇతర నియోజకవర్గాల నుంచి కిరాయి రౌడీలను దింపి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ప్రజలపై దాడులు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని నంబూరు అన్నారు.


