మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
వినుకొండ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని, ఓటమి భయంతోనే ప్రతిపక్షాలపై దాడులు, అక్రమ గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. బుధవారం నరసరావుపేటలో బొల్లాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక మాజీ శాసనసభ్యుడినైన తనను ఏ కారణంతో గృహ నిర్బంధం చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నామినేషన్లు ఉపసంహరించుకోకపోతే ఇళ్లను పొక్లెయిన్లతో కూల్చివేస్తామంటూ పురపాలక సంఘం పరిధిలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ నేరుగా బెదిరింపులకు దిగడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నామినేషన్ పత్రాలను చించివేస్తూ, పోటీ చేసే అభ్యర్థులను చితకబాదుతూ వారి భార్యాపిల్లలను అల్లాడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరాచకాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలి
చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించి గెలుపోటములు తేల్చుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండకు తాగునీరు అందించే సింగర చెరువును అభివృద్ధి చేసిందెవరో వినుకొండ ప్రజలకు బాగా తెలుసునన్నారు.
మున్సిపాలిటీ నిధులతో వినుకొండ అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. తాము చేసిన అభివృద్ధిని చూసి మీరు కూడా మారాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ, ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి.ఎస్ ఖాన్, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్. లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


