నూజెండ్ల:స్థానిక సంస్థల ఎన్నికల వేళ నూజెండ్లలో బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో ఎంపీడీవో కార్యాలయ పరిసర ప్రాంతాల్లో గందరగోళం చెలరేగింది. నామినేషన్లు వేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గడువు ముగిసే వరకు గంటల తరబడి బారికేడ్లకు దూరంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అదే సమయంలో నామినేషన్ల పేరుతో టీడీపీ శ్రేణులు కూడా ఒక్కసారిగా ప్రాంగణంలోకి దూసుకురావడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో స్థానిక పోలీసుల వ్యవహారశైలిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకులను మాత్రమే ఎంపీడీవో కార్యాలయంలోకి అనుమతించడంపై ఐనవోలు ఎస్‌ఐ బీవీ కష్ణారావును వైఎస్సార్ సీపీ నాయకులు నిలదీశారు. పోలీసులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, టీడీపీ నాయకులకు అనుకూలంగా సహకరిస్తూ తమ అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ఏకపక్ష వైఖరిని, టీడీపీ నాయకుల అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ నాయకులు, కార్యకర్తలు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అభ్యర్థులకు రక్షణ కల్పించి, నామినేషన్ దాఖలు చేసేందుకు తక్షణమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఇరువర్గాల మోహరింపుతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు ములకలూరుకు చెందిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి చింతల వీరమ్మ నామినేషన్ వేసింది. మిగిలిన వాళ్లను రానీయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.


