వైఎస్సార్‌సీపీ నేతల గృహనిర్బంధం, దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతల గృహనిర్బంధం, దౌర్జన్యం

Oct 23 2026 7:12 AM | Updated on Oct 23 2026 7:12 AM

నాదెండ్ల: టీడీపీ నాయకులకు పోలీసులు తోడై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను గృహనిర్బంధం చేయటంతోపాటూ వారిపట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. సోమ, మంగళవారాల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఉడతా వెంకటేశ్వరరావును గృహనిర్బంధం చేశారు. అంతేకాక ఆయన భార్య, అత్త పట్ల ఎస్సై కట్టా వెంకటయ్య దౌర్జన్యంగా వ్యవహరించి అసభ్యంగా మాట్లాడారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుమామిళ్ల మాజీ సర్పంచ్‌ సింగారెడ్డి లక్ష్మి, ఆయన భర్త కోటిరెడ్డి, కుమారుడు శ్రీకాంత్‌రెడ్డిలను ఉదయం నుండి సాయంత్రం వరకూ పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించారు. అప్పాపురం గ్రామానికి చెందిన మండల మాజీ ఉపాధ్యక్షుడు కోయలమూడి సాంబశివరావును గృహనిర్బంధం చేశారు.

నామినేషన్‌ వేయకుండా దౌర్జన్యం

కనపర్రు ఎంపీటీసీ స్ధానాన్ని ఎస్టీ కేటగిరికి రిజర్వు అయింది. ఈ స్ధానానికి నామినేషన్‌ వేసేందుకు మొగిలి నాగరాజు సిద్ధమయ్యారు. నాగరాజుతో పాటూ వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట బీసీ సెల్‌ అధ్యక్షుడు, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుంజి శ్రీనివాసరావు, రవికుమార్‌, పోపూరి సాగర్‌ బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్దకు రాగా టీడీపీ నాయకులు అడ్డుతగిలారు. నామినేషన్‌ వేసేందుకు వీలులేదంటూ అడ్డుతగిలి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు వారి వంతుగా నాగరాజుతో పాటూ వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకూ నిర్బంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement