నరసరావుపేట: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి తీవ్ర శారీరక వైకల్యం కలిగిన ఉపాధ్యాయులు, గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, పదవీ విరమణకు దగ్గరగా ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు కల్పించాలని ఫ్యాప్టో పల్నాడు జిల్లా చైర్మన్ ఎల్.వి రామిరెడ్డి, ఫ్యాప్టో జిల్లా డిప్యుటీ సెక్రటరీ జనరల్, యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దుకూరి మోహనరావు కోరారు. బుధవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్వో కె.అద్దయ్యకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఎన్నికల విధుల కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు సైతం విధులు కేటాయించడంతో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న తీవ్ర శారీరక వైకల్యం కలిగిన ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించడం కష్టతరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య పరిస్థితులు, వ్యక్తిగత ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. పల్నాడు జిల్లా నాయకులు ఆర్.గోవిందరాజులు, టి.వెంకటేశ్వర్లు, బాషా, వీరాంజనేయులు, రమేష్, రాసూల్, సుంకర శ్రీనివాసరావు, ఫణి, మల్లికార్జునరావు, కరీముల్లా, ఏసయ్య, బషీర్ పాల్గొన్నారు.
ఫ్యాప్టో జిల్లా కమిటీ నాయకుల విజ్ఞప్తి


