నామమాత్రంగా విధించాల్సిన జరిమానాపైనా బాదుడు అదనంగా వసూలు చేయడంపై పట్టణ వాసుల ఆవేదన
విచారణ చేయిస్తాం
నరసరావుపేట: ఉన్నతాధికారులు ఉండే జిల్లా కేంద్రంలో కొందరు ఉద్యోగుల చేతివాటం చూపుతుండటంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌టీసీ బస్టాండ్‌లో నిబంధనల పేరుతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారుల నుంచి సెక్యూరిటీ చూసే వ్యక్తులు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబ సభ్యులను బస్సు ఎక్కించేందుకు బస్టాండ్‌కు వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు సంస్థకు చెందిన కానిస్టేబుళ్లు అధిక మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ ప్రాంగణంలోకి ద్విచక్ర వాహనాన్ని తీసుకురావడం, ధూమపానం చేయడం, బహిరంగ ప్రదేశంలో మూత్ర విసర్జన చేయడం, నో పార్కింగ్ బోర్డులు ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నిలపడం వంటి ఉల్లంఘనలకు నిబంధనల ప్రకారం రూ.50 జరిమానా విధించాల్సి ఉంది. కొందరు సిబ్బంది రూ.200కు రసీదు ఇస్తూ, అదనంగా మరో రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రశ్నించిన వాహనదారులను సిబ్బంది బెదిరిస్తున్నారని తెలిసింది. ఈ విధంగా రోజుకు 20 మందికిపైగా వాహనదారుల వద్ద నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
దొంగతనాలపై నిఘా ఏది?
మరోవైపు బస్టాండ్‌లో తరచూ సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతున్నప్పటికీ వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రయాణికుల భద్రత, దొంగతనాల నియంత్రణపై దృష్టి సారించాల్సిన సిబ్బంది ఇలా జరిమానాల పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఆర్టీసీ, పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆరోపణలపై విచారణ చేయిస్తామని, అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రజా రవాణా అధికారి టి.అజితకుమారి తెలిపారు. బస్సులకు వాహనాలు అడ్డు పెట్టిన నేపథ్యంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అవగాహన కల్పించడం కోసం స్వల్ప జరిమానా విధించేలా ఆదేశించామన్నారు. ప్రయాణికులు, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌లోకి ఇతర వాహనాల రాకపోకలపై కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నట్లు ఆమె వివరించారు.


