పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి
ఒక ఖాతాలోనే డబ్బులు పడ్డాయి
● చిలకలూరిపేట–నకరికల్లు అడ్డరోడ్డు
167ఏ జాతీయ రహదారి
పనులు ప్రారంభం
● రహదారి కోసం 222 ఎకరాల
భూ సేకరణ
● 400 మంది రైతులకు ఇవ్వాల్సింది
రూ.241 కోట్ల పరిహారం
● ఇప్పటి వరకు చెల్లించింది
రూ.95 కోట్లు మాత్రమే
● హడావుడిగా పనులు
ప్రారంభించడంపై రైతుల ఆందోళన
● పలు చోట్ల పనులను
అడ్డుకుంటున్న అన్నదాతలు
నరసరావుపేట రూరల్: చిలకలూరిపేట–నకరికల్లు అడ్డరోడ్డు 167ఏ జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు విస్తరణ పనులు చేపట్టేందుకు వీలుగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించారు. అయితే, రోడ్డు విస్తరణ కోసం భూములిచ్చిన రైతుల్లో అధికమందికి నేటికీ పరిహారం అందలేదు. కానీ పనులు ప్రారంభించడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల పనులు చేపట్టిన సిబ్బందిని అడ్డుకుంటున్నారు. తమకు పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
వాడరేవు–నకరికల్లు జాతీయ రహదారి 167ఏ విస్తరణ పనుల్లో భాగంగా నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 85 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఫేజ్–1లో భాగంగా వాడరేవు–చిలకలూరిపేట మధ్య రహదారి విస్తరణ పనులు 47 కిలోమీటర్ల మేర పూర్తిచేశారు. ఫేజ్–2లో చిలకలూరిపేట–నకరికల్లు అడ్డరోడ్డు వరకు సుమారు 38 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం టెండర్ల ప్రక్రియను గత ఏడాది పూర్తిచేశారు.
భూ సేకరణలో జాప్యం
167ఏ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా నరసరావుపేట బైపాస్ రోడ్డును నూతనంగా ఏర్పాటు చేయాల్సి ఉంది. నరసరావుపేట చుట్టుపక్కల గ్రామాల్లో విలువైన భూములను బైపాస్ రోడ్డు కోసం సేకరించాల్సి వచ్చింది. నష్టపరిహారం విషయంలో అధికారులు, రైతుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో వివాదం కోర్టుల వరకు వెళ్లింది. జాతీయ రహదారి విస్తరణ కోసం జిల్లాలోని చిలకలూరిపేట, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, రొంపిచర్ల మండలాలకు చెందిన 400 మంది రైతుల నుంచి మొత్తం 222 ఎకరాలను సేకరించారు. భూములను కోల్పోయిన రైతులకు పరిహారంగా రూ.241.93 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటి వరకు కేవలం రూ.95.23 కోట్ల మేరకే పరిహారం అందింది. కానీ పనులు చేపట్టడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిలకలూరిపేట నుంచి నకరికల్లు అడ్డరోడ్డు వరకు ఇప్పటికే ఉన్న రోడ్డు పక్కనే తమకు అవసరమైన మేరకు భూమిని చదును చేసే పనిని కాంట్రాక్టర్ ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీన ఫేజ్–2 పనులకు శంకుస్థాపన చేస్తారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రకటించడం రైతుల్లో ఆందోళనను మరింత పెంచింది.
పలు చోట్ల రైతుల నిరసనలు
భూములు కోల్పోయిన రైతులు తమకు పరిహారం అందకుండా పనులు ప్రారంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావిపాడు పరిధిలో మంగళవారం పనులు ప్రారంభించగా, పరిహారం అందని రైతులు అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నారు. తమ భూముల్లో పనులు చేపట్టడానికి వీల్లేదని, పరిహారం తమ ఖాతాలో జమ చేసిన తరువాతే ప్రారంభించాలని స్పష్టం చేశారు. అనంతరం కొంతమంది రైతులు తహసీల్దార్, ఆర్‌డీవో కార్యాలయాలకు వెళ్లి పరిహారం గురించి అధికారులను ప్రశ్నించారు. త్వరలోనే పరిహారం అందుతుందని అధికారులు రైతులకు భరోసా ఇచ్చారు.
రహదారి అభివృద్ధి పనుల కోసం నా భూమిలో 65 సెంట్లు సేకరించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి వడ్డీ సహా డబ్బులు అకౌంట్‌లో జమ చేస్తామని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు పరిహారం జమ కాలేదు. మా గ్రామంలో ఎంతో మందికి ఇప్పటికీ డబ్బులు పడలేదు. కొంతమందికి అకౌంట్‌లో పడినా వడ్డీ ఇవ్వడం లేదు.
– కొరిటాల గోపాలరావు,
జొన్నలగడ్డ
రావిపాడు పరిధిలో నాకు ఉన్న 1.03 ఎకరాల పొలంలో 20 సెంట్లను భూ సేకరణలో తీసుకున్నారు. ఈ భూమి రెండు ఖాతాల్లో ఉంది. ఇందులో ఒక ఖాతాకు సంబంధించిన భూమికే నగదు జమ అయింది. రెండో ఖాతాకు చెందిన డబ్బులు ఇప్పటి వరకు వేయలేదు. పరిహారం కోసం తహసీల్దార్ వద్దకు వెళితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. న్యాయం కోసం పీజీఆర్‌ఎస్‌లో కూడా ఫిర్యాదు చేశాను.
– బొల్లా రవిశంకర్,
రావిపాడు


