నరసరావుపేట: పల్నాడు అర్బన్ డెవలప్‌మెట్ అథారిటీ (పౌడా) పరిధిలోని పంచాయతీలలో అనధికార లేఅవుట్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయరాదని, విద్యుత్ కనెక్షన్లు కూడా ఇవ్వరాదని సంబంధిత అధికారులను సంయుక్త కలెక్టర్, పౌడా వైస్ చైర్మన్ సంజనా శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం పౌడా అధికారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్, లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్‌టీపీ), జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులతో లేఅవుట్లు, అనధికార భవన నిర్మాణాలను నియంత్రించడంపై జేసీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ... ప్రభుత్వ అనుమతులు లేకుండా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లేఅవుట్లు ఏర్పాటు చేశారన్నారు. నెల్లూరు, ఒంగోలు జిల్లాలలో అనధికార లేఅవుట్లను, కట్టిన బిల్డింగ్‌లను కూల్చివేయడం జరిగిందని, ఎల్‌ఎస్‌ఆర్‌లో దరఖాస్తు చేసుకోని వాటిని కూల్చివేసినట్లు ఈ సందర్భంగా జేసీ డెవలపర్లుకు తెలియజేశారు. డెవలపర్స్ వెంటనే తమ వెంచర్లకు పౌడా అనుమతులు పొందాలని జేసీ సూచించారు. ప్రజలు కూడా అనధికార లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణాల అనుమతులు, ఇతర సదుపాయాలు పొందలేరని, లేఅవుట్ అనుమతులు పరిశీలించిన తర్వాతే ప్లాట్లు కొనుగోలు చేయాలని కోరారు.
ఇనామ్ భూముల సమస్యలు పరిష్కరించండి
వచ్చే మార్చి నాటికి అన్ని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలనే విషయం లక్ష్యంగా పెట్టుకొని ఇనామ్ భూముల సమస్యలను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఇనామ్ గ్రామాలైన వినుకొండ మండలం నాగులవరం, నూజెండ్ల మండలం అప్పాపురం, తిమ్మపురం గ్రామాల్లో ఇనామ్‌దారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇనామ్ సమస్యలను పరిష్కరించేందుకు చర్చించారు.
అలాగే విద్యుత్ కనెక్షన్లు
కూడా ఇవ్వకూడదు
రిజిస్ట్రేషన్, విద్యుత్ శాఖ
అధికారులకు జేసీ ఆదేశం
త్వరగా అనుమతులు తీసుకోవాలని
లేఅవుట్ల యజమానులకు సూచన


