నరసరావుపేట: జిల్లాలో తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడటంతో జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 117.40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం కురుస్తూనే ఉంది. మొత్తం 28 మండలాలకు గాను 22 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా చిలకలూరిపేటలో 20.8, అత్యల్పంగా సత్తెనపల్లిలో 0.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే... మాచర్ల 4.8, వెల్దుర్తి 13.8, దుర్గి 2.2, రెంటచింతల 1.0, దాచేపల్లి 1.2, కారెంపూడి 4.2, మాచవరం, అచ్చంపేట 2.2, క్రోసూరు 1.8, అమరావతి 1.4, నకరికల్లు 2.6, బొల్లాపల్లి 1.2, వినుకొండ 1.6, నూజెండ్ల 3.2, శావల్యాపురం 7.2, ఈపూరు 4.8, రొంపిచర్ల 1.6, నరసరావుపేట 12.4, యడ్లపాడు 14.4 మి.మీ. వర్షపాతం కురిసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తుఫాన్‌పై జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.


