డీజే సౌండ్‌.. గుండె గుభేల్‌! | - | Sakshi
Sakshi News home page

డీజే సౌండ్‌.. గుండె గుభేల్‌!

Sep 17 2026 1:44 AM | Updated on Sep 17 2026 1:44 AM

డీజే సౌండ్‌.. గుండె గుభేల్‌! ఇవీ మార్గదర్శకాలు... ● బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబెల్స్‌కు మించి శబ్దం చేయరాదు. ● ప్రైవేట్‌ ప్రదేశాలు (ఇళ్లు, హాళ్లు)లో డీజే శబ్దాలు చేయరాదు. ● లిఖితపూర్వక అనుమతులు లేకుండా లౌడ్‌ స్పీకర్లు, సౌండ్‌ బాక్సులు వాడకూడదు. ● నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్‌ కొట్టడం, ఇతర శబ్దాలు చేయకూడదు. ● సినిమా థియేటర్లలో సైతం 65 డెసిబుల్స్‌కు మించి శబ్దం రాకూడదు. ● వైద్యశాలలు, విద్యాసంస్థలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, న్యాయస్థానాలకు 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాలను నిషిద్ధ ప్రాంతాలుగా పరిగణిస్తారు.

విచ్చలవిడిగా డీజేల వినియోగం శబ్దాలకు ఆకతాయిల వికృత పోకడలు వింత సౌండ్లతో పెరుగుతున్న శబ్ద కాలుష్యం వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు ఇబ్బందులు వినియోగానికి అనుమతుల్లోనూ రాజకీయాలు కనీసం పట్టించుకోని పోలీస్‌ ఉన్నతాధికారులు

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం 70 డెసిబెల్స్‌ పైగా శబ్దం దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 85 డెసిబెల్స్‌ దాటితే శ్రవణ లోపం ప్రమాదం ఉండగా, 100 డెసిబెల్స్‌ పైబడి శబ్దం మరింత ప్రమాదకరంగా భావిస్తున్నారు.

సత్తెనపల్లి: డీజే శబ్దంతో వినికిడి లోపం, గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఒక వైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ డీజేలు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మారింది. శబ్దాలు రెండు రకాలు. శ్రావ్యంగా ఉండి మనసును ఉల్లాసపరిచేవి, ఫాస్ట్‌బీట్‌తో తనువును ఉర్రూతలూగించేవి. పరిధి దాటనంత వరకూ ఈ రెండు సంగీత ప్రక్రియలను అందరూ ఆస్వాదిస్తారు. ఇది మితిమీరితేనే సమస్య. ఇటు వాయించే వారికి, అటు వినేవారికి కూడా ప్రమాదమే. ఏదైనా బాణసంచా పేలితే కుక్కలు, పశువులు, ఇతర జంతువులు శబ్దాలకు కట్లు తెంచుకోవడం, నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాలకు పారిపోవడం చేస్తుంటాయి. అవి పెద్ద శబ్దాలను తట్టుకోలేవు. మనుషుల పరిస్థితి అంతే. పెద్ద శబ్దాలు గుండెలయ తప్పేలా చేస్తాయి. డీజే సౌండ్‌ బాక్స్‌ల శబ్దాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వాటి నియంత్రణ ఎంతో అవసరం. శుభకార్యం, ఉత్సవం ఏదైనా డీజే శబ్దాలు ఇప్పుడు ఉండాల్సిందే. డీజే సంగీతానికి దాని దగ్గర ఉండి ఉత్సాహంగా డాన్స్‌ చేసే వారికి ఆనందంగా ఉంటుందేమో కానీ కొందరికి అదే ప్రాణ సంకటంగా మారుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డీజేల వద్ద డాన్స్‌ చేస్తూ గుండె ఆగి చనిపోయారన్న వార్తలు ఇటీవల తరచూ వింటున్నాం. అంతేకాక శబ్ద కాలుష్యం పెరగడంతో పాటు వినికిడి, గుండె, మానసిక సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా వాటి నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.

పెరిగిన వినియోగం

ప్రస్తుతం డీజే సౌండ్‌ బాక్స్‌ల వినియోగం పెరిగిపోతోంది. రాజకీయ నాయకులకు స్వాగతం పలికేందుకు చేసే ఊరేగింపులు, జాతరలు జరిపేటప్పుడు, వినాయక నిమజ్జనాలు, ఉత్సవాల ముగింపు సందర్భాల్లోనూ డీజే సౌండ్‌ బాక్స్‌లు ఉండాల్సిందే. యువత ఉత్సాహపు వికృత డాన్స్‌లతో ఆ ప్రాంతం మారుమోగిపోవాల్సిందే. ర్యాలీగా తిరిగేటప్పుడు కిటికీలు, తలుపులు, మంచాలపై ఉండే వృద్ధులు, చిన్నారులు కంపిస్తున్నారు. గాఢనిద్రలో ఉండేవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనివల్ల అధిక శబ్ద కాలుష్యం వెలువడుతున్నా, హృద్రోగులు, సున్నిత మనసుగలవారు, పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నా ఎవరికీ పట్టింపు ఉండదు. వారి ఆనందం వారిదేనన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి. విపరీతమైన శబ్దాలతో ఊరేగే డీజే బాక్స్‌లు ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నా రాజకీయాల ప్రభావంతో పట్టించుకునేవారు కరువయ్యారు.

వైరెటీ హారన్‌లు కూడా..

జిల్లాలో ఆకతాయిలు వికృత పోకడలతో రెచ్చిపోతున్నారు. వైరెటీ హారన్‌లు, వింత సౌండ్లతో బెంబేలెత్తిస్తున్నారు. చిన్నారుల ఏడుపుతో ఉన్న హారన్‌, వెనుక నుంచి భారీ వాహనం వచ్చినట్లు ఉండే హెవీ హారన్‌, జంతువుల శబ్దాలతో ఉండే హారన్‌లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలో అధిక డెసిబెల్స్‌ శబ్దం చేసే వింత హారన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ఫ్రెషర్‌ హారన్స్‌, మ్యూజికల్‌ హారన్స్‌, మల్టీ టోన్‌ హారన్స్‌ వంటివి వినియోగించడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం వాహన హారన్ల శబ్దం సాధారణంగా 80 నుంచి 90 డెసిబెల్స్‌ మధ్యలో ఉండాలి. నివాస ప్రాంతాలు, సైలెంట్‌ జోన్లలో ఇది 60కి మించకూడదని మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ చట్టాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అనేక వాహనాల్లో అమరుస్తున్న హారన్‌లు 120 నుంచి 200 పైగా డెసిబెల్స్‌ ఉంటున్నాయని సమాచారం.

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు చికిలి ఇమాంబీ(56). భర్త పేరు పెద్ద మీరా. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిది నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామం. గ్రామంలో కొందరు పెట్టిన డీజే శబ్దానికి గుండెపోటుకు గురై మృతి చెందింది. డీజే సౌండ్‌లు ప్రమాదకరమని చెబుతున్నా లెక్క చేయకపోవటమే ఆమె మృతికి కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement