మ్యాపింగ్‌లో సవరణలకు అవకాశం లేక ఇబ్బందులు వైద్య ఆరోగ్యశాఖ పింఛన్‌లకు తెరుచుకోని వెబ్‌సైట్ ఆందోళన చెందుతున్న అర్హులు తెలుగు తమ్ముళ్ల వసూళ్ల పర్వం వేలాది మందికి పలు అడ్డంకులు రేపటి వరకు దరఖాస్తు గడువు ఇప్పటికే 55,142 మంది దరఖాస్తు
సత్తెనపల్లి: సత్తెనపల్లి 11వ వార్డు రఘురామ్‌నగర్‌కు చెందిన రామకోటమ్మకు 67 ఏళ్లు. ఈమె కుమార్తెకు ఏడేళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగితో వివాహం జరిగింది. ఆరేళ్ల కుమార్తె ఉంది. ఏలూరు జిల్లాలో వారు నివాసం ఉంటారు. వృద్ధాప్య పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది. పరిశీలించిన అధికారులు 7వ సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయి ఉందని అక్కడికి వెళ్లమన్నారు. ఆ సచివాలయానికి వెళ్లితే అందరూ ఒకే హౌస్‌హోల్డ్‌లో ఉన్నట్లు చూపడంతో కంప్యూటర్ అప్లికేషన్‌ను స్వీకరించడం లేదని అధికారులు చెప్పారు. ఆమే కాదు.. పల్నాడు జిల్లాలో ఇటువంటి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ల వల్ల, మంచాలకే పరిమితమై సర్టిఫికెట్లు ఉన్నా ఆరోగ్యశాఖ వెబ్‌సైట్ తెరుచుకోక, పింఛన్లు మంజూరు పేరుతో కొందరు తెలుగు తమ్ముళ్లు పైసా వసూల్, తమ వద్దకు రావాలంటూ కొందరు టీడీపీ నాయకులు బెదిరింపుల మధ్య పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంత వరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈ నెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు, సర్వర్ సమస్యల నేపథ్యంలో ఈ నెల 18 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు.
హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు...
ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్ కార్డు నంబర్లను ఒకే హౌస్‌హోల్డింగ్‌లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంతమందికి పెళ్లిళ్లయి అత్తవారింటికి వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపుతోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. కొన్ని గ్రామాలలో సచివాలయ సిబ్బందిని అధికార పార్టీ నేతలు తాము చెప్పినవారికే పింఛన్లు ఆన్‌లైన్‌లో పెట్టాలంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పింఛన్లు, ఇతర పథకాల దరఖాస్తుల కోసం వలంటీర్లే నేరుగా ఇంటి తలుపు తట్టేవారు. దరఖాస్తు ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేసేవారు. ఒకవేళ సచివాలయానికి వెళ్లినా సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉండి వెంటనే పనులు పూర్తి చేసిపెట్టేవారు. నేడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని అర్హులు వాపోతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ....
16వ తేదీ వరకు దరఖాస్తులు : 55,142
గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవి: 43,713
అర్బన్ ప్రాంతాలలో దరఖాస్తులు : 11,429
అప్రూవ్ అయిన దరఖాస్తులు : 2,292
తిరస్కరించిన దరఖాస్తులు : 32
పెండింగ్‌లో ఉన్నవి : 52,818
పల్నాడు జిల్లా సత్తెనపల్లి 22వ వార్డు నాగన్నకుంటకు చెందిన కుంచనపల్లి శ్రీనివాసరావు, శివకుమారి దంపతుల కుమారుడు మణికంఠ పుట్టుకతోనే నరాలు చచ్చుబడి, మెంటల్ డిజార్డర్‌తో జన్మించాడు. 26 సంవత్సరాల అతడు శారీరక వైకల్యంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యాడు. తన దయనీయ స్థితిపై వైద్య ఆరోగ్యశాఖ పింఛన్ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా, పీజీఆర్‌ఎస్‌లో వినతి పెట్టుకున్నా ఆలకించలేదు. చివరకు సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతి పత్రాలు ఇచ్చి గోడు నివేదించినా ఇంత వరకూ ఎవరూ స్పందించలేదని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పింఛన్లు మంజూరుకు దరఖాస్తులు చేసుకోవాలని కోరిన నేపథ్యంలో ఇకనైనా మణికంఠకు పింఛన్ మంజూరు చేస్తారా? అనేది వేచి చూడాలి.


