చిలకలూరిపేట టౌన్: పనికిరావని పక్కన పడేసిన వస్తువులే వారి చేతుల్లో అందమైన కళాఖండాలుగా రూపుదిద్దుకున్నాయి. చెత్తగా కనిపించే ప్రతి వస్తువులోనూ ఓ కళ దాగి ఉంటుందని మద్దిరాల జవహర్ పీఎం శ్రీ నవోదయ విద్యాలయ విద్యార్థులు తమ సృజనతో చాటిచెప్పారు. స్కూల్‌బ్యాగ్ రహిత దినోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యాలయంలో వ్యర్థ పదార్థాలతో కళాత్మక వస్తువుల తయారీపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
విద్యాలయ ఆర్ట్ విభాగం ఉపాధ్యాయుడు ఆకాష్ నేతృత్వంలో వారు ప్రత్యేకత చాటారు. కార్డ్‌బోర్డులు, పాత వార్తాపత్రికలు, ఖాళీ పెన్నులు, పెన్ క్యాపులు, ప్లాస్టిక్ బాటిళ్లు తదితర వ్యర్థ పదార్థాలను విద్యార్థులు సృజనాత్మకంగా వినియోగించారు. విద్యాలయ ప్రిన్సిపాల్ పంతంగి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. కళాఖండాలను ప్రత్యేక ర్యాక్‌లో ప్రదర్శనగా భద్రపరిచినట్లు తెలిపారు.


