నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర విభాగంలో నియమిస్తూ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టేట్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల విభాగ ప్రధాన కార్యదర్శిగా రామగిరి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శిగా ములకా రామతులసీరెడ్డి (వినుకొండ), రాష్ట్ర యూత్ విభాగ కార్యదర్శిగా కొమ్మినేని శంకరరావు, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శిగా శానంపూడి మహేంద్రరెడ్డి (గురజాల) నియమితులయ్యారు.
కాపు జేఏసీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాలి
నాదెండ్ల: కాపు జేఏసీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గణపవరం గ్రామానికి చెందిన గాలి హనుమంతరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్‌నాయుడు నుండి శుక్రవారం గుంటూరులో జరిగిన కాపు కార్యవర్గ సమావేశంలో నియామక పత్రాన్ని అందుకున్నారు. గాలి హనుమంతరావు మాట్లాడుతూ తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్‌నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపుల అభ్యున్నతి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతానని పేర్కొన్నారు. పలువురు కాపు సంఘ నాయకులు అభినందించారు.
నేడు జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన సీనియర్ సివిల్ న్యాయాధికారి కిరణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. కోర్టు ప్రాంగణంలో శనివారం అదాలత్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, చెక్ బౌనన్స్ కేసులు, భరణం కేసులు, కుటుంబ, రెవెన్యూ, ముందస్తు వ్యాజ్యాలను కక్షిదారులు రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని విలువైన సమయాన్ని వృథా కాకుండా కాపాడుకోవాలన్నారు.
డప్పు, చర్మకారులు పెన్షన్‌లకు దరఖాస్తు చేసుకోండి
జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మయ్య
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలోని డప్పు కళాకారులు, చర్మకారులు తమ పెన్షన్ దరఖాస్తులను వారికి సమీపంలోని స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డుల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాదికారి ఎం.లక్ష్మయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా కార్యాలయానికి రానవసరం లేదని స్పష్టం చేశారు. అర్హత కలిగిన గ్రామీణ ప్రాంతం వారు స్వీయ ధ్రువీకరణతో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, పట్టణ ప్రాంతం వారు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రట రీ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, క్షేత్రస్థాయి పరిశీలన నిబంధనల మేరకు సంబంధిత అధికారులు నిర్వహిస్తారని వివరించారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే స్వర్ణ గ్రామ, వార్డుల అధికారులను సంప్రదించాలని తెలిపారు.
కరువు మండలంగా ప్రకటించాలి
రొంపిచర్ల: రొంపిచర్ల మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వర్షపాతం తగ్గిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందే తెలిసినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని అన్నారు. పంటలు లేక ఖాళీగా ఉన్న రైతులకు ఎకరాకు రూ.10వేల రూపాయలు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ బి.నిర్మలకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రొడ్డా అంజిరెడ్డి, సీపీఐ మండల నాయకులు పిడెం హుస్సేన్, జమ్ములమూడి వెంకటేశ్వరరావు, చెరుకూరి నాగేశ్వరరావు, తన్నీరు వెంకట కోటయ్య, అనీల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.5.47 లక్షలు
మాచర్ల: పట్టణంలోని పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం చేకూరింది. రెండు నెలలుగా సంబంధించి ఆలయాలకు చెందిన హుండీలను సత్తెనపల్లికి చెందిన దేవాదాయ శాఖాధికారులు లీలావతి, భ్రమరాచారి, పట్టణ ఈఓ సైదులు, ట్రస్టు బోర్డు చైర్మన్ కొమెర అనంతరాములు ఆధ్వర్యంలో శుక్రవారం లెక్కింపు జరిపారు. 2నెలల 15 రోజులకు రూ. 5లక్షల ,47 వేల ,556 ఆదాయం చేకూరినట్లు ఈఓ సైదయ్య తెలిపారు.


