యడ్లపాడు: పట్టణంలో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు వద్ద ఆగస్టు 26 రాత్రి జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో పాత హైవేపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం 11న ప్రధాన కూడళ్లను అధికారులు సంయుక్తంగా పరిశీలించారు. పట్టణంలోని ఎన్‌న్‌ఆర్‌టీ సెంటర్, అడ్డరోడ్డు, విజయాబ్యాంక్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, ఏఎంసీ చెక్‌పోస్టు ప్రాంతాల్లో ఎన్‌న్‌హెచ్‌ఏఐ అధికారులు, చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్, పల్నాడు జిల్లా ట్రాఫిక్ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్ సీఐ రమేష్, పట్టణ ఎంవీఐ ఎన్ గోపాల్ క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. వాహనాల వేగం, ట్రాఫిక్ రద్దీ, మలుపులు, ప్రమాదాలకు దారితీసే ఇతర అంశాలను గుర్తించారు.
వేగానికి కళ్లెం.. ప్రమాదాలకు చెక్
ప్రమాదకర ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పలు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మూడు లేయర్ల స్పీడ్ బ్రేకర్లు, ఎస్–టైప్ బ్యారికేడ్లు, రోటరీ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. రహదారిపై ప్రమాదకర వస్తువులు, అడ్డంకులు వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా ఆబ్జెక్ట్ హజార్డ్ మార్కింగ్స్ చేయనున్నారు. వీటితోపాటు స్పీడ్ బ్రేకర్లు, ఓహెచ్‌ఎంఎస్, టీఎంబీలు, రోడ్ మార్కింగ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేసేవిధంగా పరిశీలిన చేశారు.
వేగ నియంత్రణ, బారికేడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్‌కు ప్రతిపాదనలు
ముఖ్యంగా రాత్రివేళల్లో వాహనదారులకు ప్రమాదకర ప్రాంతాలు ముందుగానే కనిపించేలా హెచ్చరికలు, సూచికలు ఏర్పాటు నిర్ణయాన్ని వెలిబుచ్చారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి, అక్కడ అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గుర్తించిన ప్రాంతాల్లో త్వరలోనే అవసరమైన ఏర్పాట్లను పునరుద్ధరించడంతో పాటు కొత్తగా భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా..ప్రమాదానికి అవకాశం ఉన్న చోటే ముందుగా అప్రమత్తం కాావాలన్నదే అధికారుల లక్ష్యంగా ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ప్రధాన కూడళ్లలో భద్రతా చర్యలకు అధికారుల కసరత్తు


