నేడు ఏరియా హాస్పిటల్‌లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ ప్రారంభం గత ప్రభుత్వంలో పనులు ప్రారంభమై ఇప్పటికి పూర్తి వర్చువల్‌గా ప్రారంభించనున్న కేంద్ర ఆరోగ్య మంత్రి, ముఖ్యమంత్రి పీఎం అభిమ్ పథకం కింద రూ.1.25 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు
నరసరావుపేట: పల్నాడు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య నిర్ధారణ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. నరసరావుపేటలోని ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ (ఐపీహెచ్‌ఎల్)ను శనివారం ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించగా ఇప్పటికీ అందుబాటులోకి వచ్చింది. ఇటువంటి ల్యాబరేటరీలను రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి నిర్ణయించారు. అందులో నరసరావుపేట ఒకటి. అందుకోసం విదేశాల నుంచి 12 మెషీన్లు కొనుగోలు చేశారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్న ల్యాబొరేటరీలో 63 వైద్య పరీక్షలు జరుగుతుండగా ఇప్పుడు ప్రారంభించే ఐపీహెచ్‌ఏల్ ల్యాబొరేటరీ ద్వారా థెరాయిడ్, బ్రెస్ట్, ప్రొస్టేట్ క్యాన్సర్, హార్పోన్స్ పరీక్షలు లాంటివి మరో 71 పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. దీని నిర్వహణకు 12 మంది టెక్నీషియన్లు అవసరం కాగా ప్రస్తుతం ఐదుగురే పనిచేస్తున్నారు. వీరందరూ కాంట్రాక్ట్ మెడికల్ ఉద్యోగులే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ల్యాబొరేటరీని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఏరియా ఆసుపత్రిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పీఎం అభిమ్ పథకం కింద నిధులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, టీడీపీ ప్రజా ప్రతినిధులు, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ పాల్గొంటారన్నారు. ప్రత్యేక అతిథులుగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్, ఆరోగ్యశాఖ కమిషనర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ కెవీఎన్.చక్రధరబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఏరియా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి పాల్గొననున్నారు.


