రొంపిచర్ల: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు సృజనాత్మకతను చాటుతూ మండలంలోని పీ.ఎం. శ్రీ ఏపీ మోడల్ స్కూల్ 8వ తరగతి విద్యార్థి జి.సంజయ్ ఆకులు, కూరగాయలతో వినూత్నంగా వినాయకుడి విగ్రహాన్ని రూపొందించాడు. పాఠశాలలోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విభాగంలో కార్వింగ్ కళను ఉపయోగించి వినాయకుని ప్రతిమలను తయారు చేశాడు. విద్యార్థుల్లో సృజనాత్మకత, కళాదృష్టిని వెలికితీసేందుకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ శిక్షణ అందిస్తున్నామని పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రవినాయక్ తెలిపారు. మట్టితో మాత్రమే కాకుండా ఆకుకూరలు, కూరగాయలతోనూ పర్యావరణహితంగా వినాయక ప్రతిమలను రూపొందించవచ్చని విద్యార్థి తన ప్రతిభ ద్వారా చాటాడన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వినూత్న కళల ద్వారా ఉపాధి, ఆదాయ మార్గాలను సైతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రతిమను రూపొందించిన సంజయ్‌ను ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు.


