యడ్లపాడులో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

యడ్లపాడులో భారీ చోరీ

Sep 11 2026 9:58 AM | Updated on Sep 11 2026 9:58 AM

యడ్లపాడు: నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. యడ్లపాడుకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌ వెళ్లారు. ఆమె ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.75 లక్షల విలువైన సొత్తు కాజేశారు. మండల కేంద్రమైన యడ్లపాడు మెయిన్‌ బజార్‌లో ప్రపత్తి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని ఓ నివాసంలో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పార్వతి నాగలక్ష్మి ఈ నెల 3వ తేదీన హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో 8వ తేదీ రాత్రి యడ్లపాడులోని ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఫోన్‌ చేసి సమాచారం అందించారు. నాగలక్ష్మి గ్రామంలోని బంధువులకు ఫోన్‌ చేసి ఇంటి వద్దకు పంపించారు. వారు పరిశీలించగా, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగినట్లు గుర్తించారు. నాగలక్ష్మి హైదరాబాద్‌ నుంచి గురువారం ఉదయం తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోని లాకర్‌ను కూడా దుండగులు పగులగొట్టారు. అందులో ఉన్న సుమారు 50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి వస్తువులు, రూ.2 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో సొత్తు చోరీ కావడంతో పోలీసులు ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి. సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్‌ఐ టి. శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో నిందితుల కదలికలకు సంబంధించిన ఆధారాలను గుర్తించే ప్రయత్నం చేశారు.

రెక్కీ చేసి మరీ...

ఇంట్లో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, నగదు ఉన్న విషయాన్ని దుండగులు ముందుగానే తెలుసుకున్నారా..? చోరీకి ముందు పగటిపూట ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వేళ ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని చోరీకి పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ, అనుమానితుల కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది.

50 సవర్ల బంగారం, 5.4 కిలోల వెండి, రూ.2 లక్షల నగదు అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement