జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్‌హార్స్‌’ అవుట్‌లెట్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్‌హార్స్‌’ అవుట్‌లెట్‌

Sep 10 2026 1:51 AM | Updated on Sep 10 2026 1:51 AM

● సూర్యాపేట హోటల్‌–7లో ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ ప్రారంభం ● హాజరైన సంస్థ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ ఎండీ మోహన్‌ శ్యామ్‌ప్రసాద్‌

తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్‌హార్స్‌ గ్రూప్‌ (టీడీహెచ్‌) కొంతకాలంగా దేశీయ రిటైల్‌ మార్కెట్‌పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–65)పై సూర్యాపేట మండలం, రాయన్‌గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్‌–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్‌హార్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహన్‌ శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్‌లెట్‌ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్‌ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్‌కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్‌కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్‌ ప్రోడక్ట్స్‌, డ్రై ఫ్రూట్స్‌, మిల్లెట్స్‌ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్‌ ఫుడ్స్‌, మిల్లెట్‌ మార్వెల్‌ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్‌పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్‌–7వద్ద తెనాలి డబుల్‌ హార్స్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

మేళ్లచెరువు: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు కేంద్రంలోని ఎన్‌ఎస్‌పీ ముక్త్యాల బ్రాంచ్‌ కెనాల్‌ వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాలు.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన బోగం ఏసుబాబు (30) రెండు రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఏసుబాబుతో పాటు అతడి బంధువులైన ఏడుకొండలు, ప్రవీణ్‌ కలిసి మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని ఎన్‌ఎస్‌పీ ముక్త్యాల బ్రాంచ్‌ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఏసుబాబు వల విసరగా, అది నీటిలో ఎక్కడో చిక్కుకుంది. ఆ వలను బయటికి తీసేందుకు ఏసుబాబు కాలువలోకి దిగాడు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆయన కాలుజారి నీటిలో మునిగి మృతి చెందాడు. బుధవారం మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు.

నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రధాన లక్ష్యం

తాడికొండ: ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌– మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్‌ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్‌ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్‌ లాస్‌ తగ్గింపు, విద్యుత్‌ చౌర్యం నియంత్రణ, విద్యుత్‌ భద్రత, లైన్‌న్లు, ట్రాన్‌న్స్‌ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్‌స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్‌ అంతరాయాల నియంత్రణ, పీక్‌ డిమాండ్‌ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్‌సైట్‌ www.apcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌న్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement