జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు
ఈపూరు: వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు అన్నారు. మండలంలోని ముప్పాళ్లలో బుధవారం క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నీటి లభ్యతను బట్టి పంట ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకొనే అపరాలు కందులు, మినుములు, పెసలను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని వివరించారు. అర్హులైన రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం ఏపీ ఏఐఎంఎస్ 2.0 పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఆర్.రామారావు పాల్గొన్నారు.
రొంపిచర్ల: మండల కేంద్రమైన రొంపిచర్లలో రైతులతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, రైతులు సాగు చేయనున్న పంటలు, వర్షపాతం నమోదైతే చేపట్టాల్సిన పంటల సాగు తదితర అంశాలపై రైతులతో చర్చించారు. రాబోయే రోజుల్లో సరైన స్థాయిలో వర్షపాతం నమోదై కాలువలకు నీరు వచ్చే పరిస్థితి ఏర్పడితే మొక్కజొన్న పంట సాగు చేస్తామని, తగిన నీటి వసతి లేకపోతే శనగ పంటను సాగు చేసేందుకు మొగ్గు చూపుతామని రైతులు జిల్లా వ్యవసాయ అధికారికి వివరించారు. ఈ సందర్భంగా రైతులు తాము సాగు చేస్తున్న గడ్డి పంటకు యూరియా అవసరముందని జిల్లా వ్యవసాయ అధికారిని కోరారు. దీనిపై స్పందించిన ఆయన రైతులకు అవసరమైన యూరియాను తప్పకుండా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


