1.3 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

1.3 కిలోల గంజాయి స్వాధీనం

Sep 10 2026 1:51 AM | Updated on Sep 10 2026 1:51 AM

ఇద్దరు యువకుల అరెస్ట్‌

చిలకలూరిపేటటౌన్‌: పట్టణం పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. స్థానిక సుగాలీ కాలనీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం అందడంతో మంగళవారం ఎస్‌ఐ వి.సోమేశ్వరరావు, సిబ్బంది సుగాలి కాలనీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1.3 కిలోల గంజాయి కలిగిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పి.రమేష్‌ తెలిపారు. బుధవారం స్థానిక కోర్టులో హాజరుపరిచగా, రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

కాలువలో దూకి మహిళ ఆత్మహత్య

నకరికల్లు: అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేని మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని దేచవరం పరిధిలోని చిలుకలూరిపేట మేజర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ కె.సతీష్‌ తెలిపిన వివరాలు... మండలంలోని అడ్డరోడ్డు గ్రామానికి చెందిన తుమ్మా తిరుపతమ్మ (31) గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కాగా మతిస్థిమితం కోల్పోయిన తిరుపతమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లింది. ఆమె కోసం వెతకగా బుధవారం చిలకలూరిపేట మేజర్‌లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. స్థానికుల సహకారంతో మృతదేహాన్ని వెలికితీసి మృతురాలు తిరుపతమ్మగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ప్రజాకవి కాళోజీకి ఘన నివాళి

యడ్లపాడు: ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన కాళోజీ.. సామాజిక చైతన్యానికి తన సాహిత్యాన్ని వేదికగా మలిచారని సాహితీ విమర్శకులు డాక్టర్‌ పీవీ సుబ్బారావు, జనవిజ్ఞాన వేదిక శాఖ ప్రధాన కార్యదర్శి బొంత అజయ్‌బాబు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంథాలయంలో బుధవారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కాళోజీ చేసిన విశిష్ట సాహితీ సేవలను, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాన్ని వివరించారు. కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు తేళ్ల సుబ్బారావు మాట్లాడారు. తొలుత కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్‌ దార్ల బుజ్జిబాబు, గ్రంథాలయ ఇన్‌చార్జి సాతులూరి అచ్చమ్మ, సరోజినీ పాల్గొన్నారు.

విద్యుత్‌శాఖ ఆకస్మిక తనిఖీలు

అమృతలూరు(వేమూరు): అక్రమంగా విద్యుత్‌ వాడుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్‌ శాఖ బాపట్ల జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్‌ జి.ఆంజనేయులు అన్నారు. ఆంజనేయులు ఆధ్వర్యంలో 60 బృందాలు బుధవారం అమృతలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్‌ మీటర్ల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అధిక లోడు వాడుతున్న, డైరెక్ట్‌ ట్యాపింగ్‌ 287 సర్వీసులను గుర్తించి, వారి నుంచి రూ 11,86,500 అపరాధ రుసుము విధించడం జరిగిందని ఆయన తెలిపారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు జి.భాస్కరరావు, డీపీఈ, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, ఎం.భాస్కరరావు, డిప్యూటీ ఎగ్జక్యూటివ్‌ ఇంజినీరు, ఆర్‌.విజయశ్రీనివాస్‌, చుండూరు ఆపరేషన్‌ డిప్యూటీ ఎగ్జక్యూటివ్‌ ఇంజినీరు, డి.శ్యామ్‌ సుధాకర్‌బాబు, అమర్తలూరు అపరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజినీరు ఎల్‌.నిరంజన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లీటర్‌ లిక్విడ్‌ గంజాయి స్వాధీనం

ఇద్దరు పల్నాడు యువకుల అరెస్ట్‌

ఏలూరు టౌన్‌: జిల్లాలు దాటి తరలిస్తున్న లిక్విడ్‌ రూపంలో ఉన్న గంజాయిని పెదపాడు పోలీసులు పట్టుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన తిరుమల సాయి, వెంకట సాయి అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అరకు నుంచి పల్నాడు జిల్లాకు లిక్విడ్‌ రూపంలో ఉన్న గంజాయి (హాషిష్‌ ఆయిల్‌) ఒక బాటిల్లో లీటర్‌ నింపుకుని తరలిస్తున్నారు. అదే సమయంలో పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకట్‌ కుమార్‌ తనిఖీలు చేస్తున్నారు. యువకుల వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా లిక్విడ్‌ రూపంలో ఉన్న గంజాయిని గుర్తించారు. వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లిక్విడ్‌ గంజాయి విలువ సుమారు 13 లక్షల వరకు ఉంటుందని అంచనా. 14 కేజీల గంజాయి ఒక లీటర్‌ లిక్విడ్‌ గంజాయితో సమానమని అధికారులు చెబుతున్నారు. తనిఖీల్లో సీఐ రాజశేఖర్‌, సిబ్బంది కమలాకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement