గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్‌కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు పాల్గొన్నారు.
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
దాసరి సువర్ణరాజు


